టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలు వేరైనా బాబు అంటే రేవంత్‌కు గౌరవం ఉందని పలు సందర్భాల్లో అర్ధమైంది. అయితే అదే చంద్రబాబు ద్వారా రేవంత్‌ని, ప్రత్యర్ధి పార్టీలు టార్గెట్ చేసి విమర్శలు చేశాయి. రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు మనిషే అని, పీసీసీ రావడానికి చంద్రబాబే కారణమని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు.

అయితే ఆ విమర్శలకు కూడా రేవంత్ గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వచ్చారు. అసలు టీఆర్ఎస్‌లో 70 శాతం నాయకులు టీడీపీ నుంచి వెళ్ళిన వారే అని, ఆఖరికి కేసీఆర్ కూడా టీడీపీ మనిషే అని మాట్లాడుతూ వచ్చారు. ఇలా రేవంత్ విషయంలో చంద్రబాబు టాపిక్ ఎప్పటికప్పుడో వస్తూనే ఉంది. తాజాగా రావిర్యాలలో జరిగిన దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో  రేవంత్ మరొకసారి చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు.

తాజాగా తాను ఐ‌ఏ‌ఎస్ అవుదామనుకుంటే, తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి కేటీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి రేవంత్ కౌంటర్ ఇస్తూ, కేసీఆర్...మహేందర్ రెడ్డికి ద్రోహం చేసి మరీ కేటీఆర్‌కు సిరిసిల్ల టికెట్ దక్కేలా చేసుకున్నారని, పైగా చంద్రబాబు కాళ్ళు పట్టుకుని  మరీ టీడీపీ సపోర్ట్‌తో కేటీఆర్‌ని గెలిపించుకున్నారని రేవంత్ మాట్లాడారు. అంటే 2009 ఎన్నికల్లో తొలిసారి కేటీఆర్ సిరిసిల్లలో పోటీ చేసిన విషయం తెలిసిందే.

అప్పుడు టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఉంది. పైగా అప్పటివరకు టీడీపీకి సిట్టింగ్ సీటుగా ఉన్న సిరిసిల్లని టీఆర్ఎస్‌కు ఇచ్చారు. అలాగే అప్పుడు టీఆర్ఎస్‌కు కూడా పెద్ద బలం లేదు. ఇక టీడీపీకి ఉన్న బలంతో కేటీఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారని రేవంత్ చెబుతున్నారు. అయితే ఆ తర్వాత కేటీఆర్ బలమైన నాయకుడుగా ఎలా తయారయ్యారు...టీఆర్ఎస్‌కు తిరుగులేని బలం ఎలా వచ్చిందనే విషయాలు తెలిసినవే. అయితే రేవంత్...ఏదొకవిధంగా చంద్రబాబు టాపిక్ తీసుకోస్తూ, టీఆర్ఎస్‌నే ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: