చాలా సుంద‌ర న‌గ‌రం శ్రీ‌కాకుళం అని రాసుకోవ‌డంలో అధికారులు ఆనందంగా ఉండ‌వ‌చ్చు. కానీ అభివృద్ధి మాత్రం అస్స‌లు లేదు.



శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ లోకి ఏడు పంచాయ‌తీల విలీనంతో సుదీర్ఘ కాలంగా నెల‌కొన్న వివాదం తెర‌ప‌డింది. విలీనం జ‌రిగిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌ల వేధింపు మాత్రం అలానే ఉంది. ఇప్ప‌టికిప్పుడు ప‌నుల‌ను చేపట్టే అవ‌కాశం లేద‌ని చెప్ప‌లేం. కానీ అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక అధికారులు సిద్ధం చేయాలి. ఏడు పంచాయ‌తీల్లో చాపుర పంచాయ‌తీ అధిక ఆదాయం తీసుకువ‌చ్చే పంచాయ‌తీ. ఈ పంచాయ‌తీ ప‌రిధిలో ఏడెనిమిది కాల‌నీలు ఉన్నాయి. ఇవ‌న్నీ ఇప్పుడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో విలీనం అయిపోయాయి. అధికారులు కూడా బోర్డులు త‌గిలించేందుకు సిద్ధం అవుతున్నారు. న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ఇంకొన్ని పంచాయ‌తీల విలీనం కూడా అయిపోయాయి. వాటిలో పెద్ద‌పాడు, పాత్రుని వ‌లస ఉన్నాయి.ఈ రెండు పంచాయ‌తీలూ ఇప్ప‌టి ఎమ్మెల్యే ధ‌ర్మాన  ప్ర‌సాద‌రావు కు మ‌ద్ద‌తుగా నిలిచిన పంచాయ‌తీలు. వీటిలో కూడా అభివృద్ధి ఏమీ లేదు. ఖాజీపేట, కిల్లిపాలెం పంచాయ‌తీల‌ వ‌ర‌కూ ఎర్ర‌న్న అనుచ‌రుడు నాగావ‌ళి కృష్ణ తో స‌హా స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు రోడ్ల‌పై దృష్టిసారించి ప‌నులు చేయించ‌గ‌లిగారు. ఇక తోట‌పాలెం పంచాయ‌తీ కొంత అభివృద్ధి సాధించినా ఇంకా మోక్షానికి నోచుకోవాల్సిన ప‌నులు ఉన్నాయి. తోటపాలెం, కుశాల‌పురం పంచాయ‌తీలు న‌గ‌ర పాల‌క సంస్థ‌లో విలీనం అయిన‌ప్ప‌టికీ ఇవి ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్నాయి. వీటి అభివృద్ధి అన్న‌ది అటు ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్, ఇటు శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ ప‌ట్టించుకోవాల్సిన ఆవ‌శ్య‌త‌క ఉంది.


ముఖ్యంగా కాల‌నీల స‌మ‌స్య‌లే ప్ర‌ధానంగా వెన్నాడుతున్నాయి. చాపురం పంచాయ‌తీ ప‌రిధిలో ఉన్న విశాఖ ఎ, బీకాల‌నీల‌లో ర‌హ‌దారులు స‌రిగా లేవు. డ్రయినేజీ వ్య‌వ‌స్థ బాలేదు. కొన్ని పంచాయ‌తీ స్థలాలు ఆక్ర‌మ‌ణ‌ల‌లో ఉన్నాయి. ప‌న్నుల వ‌సూలుకు ప్రాధాన్యం ఇచ్చే అధికారులు త‌రువాత కాలంలో రోడ్ల నిర్వ‌హ‌ణ‌పై కానీ, దోమ‌ల నియంత్ర‌ణ‌పై కానీ వీధి కుక్క‌ల నియంత్ర‌ణ‌పై కానీ దృష్టి సారించ‌డం లేదు. ముఖ్యంగా చాలా ప్రాంతాల‌లో చీక‌టి  ప‌డితే చాలు భ‌యం గుప్పిట జీవిస్తున్నారు. వీధి దీపాలు లేని కార‌ణంగా కొన్ని చోట్ల‌,  ఉన్నా వెల‌గ‌ని కార‌ణంగా కొన్ని చోట్ల అమ్మాయిలు రాక‌పోక‌లు సాగించేందుకు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.



లేడీస్ హాస్టళ్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంగా విశాఖ బీ కాల‌నీ ఉండ‌డంతో ఆక‌తాయిల జోరు పెరిగిపోతోంది. రోడ్ల విస్త‌ర‌ణ కాదు క‌దా క‌నీసం విరిగిపోయిన స్పీడ్ బ్రేక‌ర్ల‌ను కూడా వేయించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా విశాఖ ఏ, బీ కాల‌నీల్లో విప‌రీతం అయిన వాహ‌నాల రద్దీ కార‌ణంగా అప్పుడెప్పుడో వేసిన ర‌హ‌దారులు పూర్తిగా ఛిద్రం అయిపోయాయి. వీటిని బాగు చేయ‌కుండా, కాలువ‌ల నిర్వ‌హ‌ణ‌పై దృష్టి సారించ‌కుండా విలీనం పేరిట అధికారులు హ‌డావుడి అయితే ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఇప్ప‌టికే మున్సిప‌ల్ సిబ్బంది రంగంలోకి దిగి క‌లెక్ట‌ర్ ఆదేశాల‌ను అనుస‌రించి పంచాయ‌తీ సిబ్బంది నుంచి..ఆస్తులు, వాటి రికార్డులు కూడా తీసుకున్నారు. ఇటీవ‌ల వ‌సూలు చేసిన ఇంటి ప‌న్నుల ద్వారా వ‌చ్చిన న‌గ‌దు కూడా అప్ప‌గించేశారు స్థానిక సిబ్బంది.  ఇంకేం పాల‌న బాగుంటుంద‌ని అనుకోండి?


మరింత సమాచారం తెలుసుకోండి: