వచ్చే యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో అటు రైతులు.. ఇటు మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు జరగనున్న నష్టంతో పాటు రైస్ మిల్లులు మూతబడనున్నాయి. ఇందులో పనిచేసే సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది 11,67,542 ఎకరాల్లో వరి పంట సాగు అయింది. ఇందులో దొడ్డు రకం 4,91,549 ఎకరాలు కాగా, సన్నరకం 6,99,941 ఎకరాలు.27.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. సుమారు 20 ఏళ్ల నుంచి కేంద్రాల ద్వారానే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని బియ్యం గా మార్చేందుకు రైస్ మిల్లులకు పంపిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మిల్లులు అన్ని మూతపడనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 700 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే  ఎక్కువగా మిల్లులు ఉన్న జిల్లా కూడా ఇదే.

ఇందులో సుమారు లక్ష మంది హమాలీలు పనిచేస్తూ, కుటుంబాలను పోషిస్తుంటారు.  ఇక్కడున్న 700 పారాయిబాల్డ్ మిల్లులు కస్టమ్ మిల్లింగ్ రైస్ పైనే ఆధారపడి నడుస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే మిల్లులు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వం పారాయి బాల్డ్ రైస్ కొనుగోలు చేయకపోతే ఆ మిల్లులు మూతపడనున్నాయి. ఫలితంగా అందులో పనిచేసే లక్ష మంది హమాలీ కార్మికులు జీవనోపాధి కోల్పోనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో  ఈ కుటుంబాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు, రైస్ మిల్లుల యజమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: