సుదీర్ఘ ప్రస్థానంలో ఓ నటుడు ఓడిపోయాడు. జాతీయ స్థాయిలో రాణించిన నటుడు ప్రాంతీయ వాదం కారణంగా ఓడిపోయాడు.
ఇదీ ప్రకాశ్
రాజ్ ఆవేదన. అందుకే తాను ఇకపై మా లో కొనసాగబోనని స్పష్టం చేసిన వైనం, అందుకు తగ్గ విధంగా చెప్పిన ప్రకటన అన్నవి ఇప్పటి వివాదాలకు తార్కాణం.
రాజకీయ ఆటలు సినిమా పరిశ్రమలోకి వచ్చాక రోజుకో వినోదం రోజుకో విషాదం పరిచయం అవుతూనే ఉన్నాయి. వీటికి అనుగుణంగానే పరిణామాలు కూడా రోజురోజుకూ మారుతూ వస్తున్నాయి. ఈ చదరంగంలో ఇప్పుడు బలి కాబోతున్న పావు మాత్రం ప్రకాశ్ రాజే! ఆయన మా ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి, బైలాస్ మార్పునకు సంబంధించి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. మా అసోసియేషన్ బై లాస్ ను ఎప్పటి నుంచో మార్చాలని, ప్రాంతేతర వ్యక్తులను ఇందులోకి తీసుకు రాకూడదని కూడా చెబుతూ వస్తున్నారు. దీంతో దీనికి అనుగుణంగా మా అసోసియేషన్ లో కీలక మార్పులు రానున్నాయి. ఇవే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ లాంటి వారికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. బై లాస్ మారితే ప్రాంతేతర వ్యక్తులకు అస్సలు సభ్యత్వం ఉంటుందో లేదో అన్నది కూడా అనుమానమే. కేవలం సభ్యత్వం ఇచ్చి, వారిని మా ఎన్నికలకు పోటీ చేసేందుకు మాత్రం అంగీకారం ఇచ్చేందుకు లేదా అనుమతించేందుకు మాత్రం మా సభ్యులు ఒప్పుకునేలా లేరు. దీంతో తాజా నిర్ణయం ఒకటి వెలుగులోకి రాక మునుపే పోయిన పరువు మళ్లీ ఎందుకు పోగొట్టుకోవడం అన్న విధానానికి అనుగుణంగా ప్రకాశ్ రాజ్ తన రూట్ మార్చారు. ఇదే సందర్భంలో ఆయన తనవైపు సానుభూతి ఉండేలా కొన్ని మాటలు చెప్పి వెళ్లారు. దీంతో వివాదం అన్నది సుఖాంతం కావాలన్నదే ఆయన తపన అన్నది పైకి వినిపించిన మాట. ఇక మా ఎన్నికలు తరువాత కూడా మా అసోసియేషన్ సభ్యులు కొన్ని మాటలు అనడంతో తనకు బాధ కలిగించాయి అని కూడా చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద తగాదాగా మారింది. రేపటి వేళ ప్రకాశ్ రాజ్ కెరియర్ క్లోజ్ అయ్యేందుకు కూడా తాజా వివాదాలే పెనుత్పాతం సృష్టించి ముగించనున్నాయి.