దాదాపు ప‌దేళ్లు అవ‌మానాలు చూసిన జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ప్ర‌జా వేదిక కూల్చేశారు. ఇంకొన్ని క‌క్ష సాధింపుల‌కు పూనుకున్నారు. అదే స్పీడులో కృష్ణా న‌ది క‌ర‌కట్ట‌ల‌పై ఉన్న అక్ర‌మాల‌న్నింటినీ తొల‌గిస్తాన‌ని చెప్పి ఆ త‌రువాత సైలెంట్ అయిపోయారు. అదే స్పీడులో వాటిని ఎందుకు తొల‌గించ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు చవి చూశారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు నిలుపుద‌ల చేసి మ‌రో వివాదంకు తెర‌లేపారు. అమ‌రావ‌తి ప‌నులు ఆపేసి, అప్ప‌టిదాకా ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లించ‌కుండానే చుక్క‌లు చూపించారు. ఉపాధి హామీ ప‌నులకు సంబంధించి కూడా బిల్లులు చెల్లించ‌కుండా చుక్క‌లు చూపించారు. ఇవ‌న్నీ ఇలా ఉండంగానే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండానే అధికార ప‌క్షం ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోయింది అని కొన్ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ల‌క్ష‌లు విలువ చేసే ప్ర‌భుత్వ నిధులు ప‌నులు ఆగిపోయి, రాష్ట్రాన్ని అంధ‌కారంలోకి నెట్టేశార‌న్న అభిప్రాయం ఒక‌టి స్థిరం అవుతోంది. వీటిపై కొన్ని సార్లు స‌హేతుక రీతిలో విప‌క్షం ప్ర‌శ్నించినా కూడా మార్పు రాలేదు వైసీపీలో!

రాష్ట్రంలో విభిన్న ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. అధికార పార్టీకీ, విప‌క్ష స‌భ్యుల‌కూ ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ప‌రిణామాలు ఉన్నాయి. అయినా కూడా ఎవ్వ‌రూ ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఎవ‌రి ప‌ని వారు చేసుకుని పోతున్నారు. ప‌ర‌స్ప‌రం తిట్ల దండ‌కం అందు కుని ఎవ‌రి గొంతుక వారు వినిపిస్తూ, స‌హేతుక రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఈ త‌రుణంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాల్సిన ఇరు వ‌ర్గాలు కూడా సంయ‌మ‌నం కోల్పోయి మాట్లాడుతున్నారు. త‌గువుల‌కు సై అంటున్నారు. ఇదే ధోర‌ణి కొన‌సాగితే శాంతి భ‌ద్ర‌త‌లకు విఘాతం త‌ప్ప‌దు. జ‌గ‌న్ వ‌ర్గం ఓ వైపు, చంద్ర‌బాబు వ‌ర్గం ఓ వైపు అధిప‌త్య ధోర‌ణిలో భాగంగా అనుచిత వ్యాఖ్య‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ఎవ్వ‌రూ కూడా అంగీక‌రించ‌లేని భాష‌లో ఒక‌రినొక‌రు తిట్టుకుంటున్నారు. మంత్రులు కూడా అదే స్థాయి భాష‌లో మాట్లాడుతున్నారు.


గ‌తంలో కూడా ఇదే విధంగా మాట్లాడి స్వామి భ‌క్తి చాటుకున్న మంత్రులు మ‌రో మారు శ్రుతి త‌ప్పుతున్నారు. మాట‌ల యుద్ధం పెంచుకుంటూ పోతున్నారే కానీ ఎవ్వ‌రూ ఎక్క‌డా ఆగ‌డం లేదు. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను అడ్ర‌స్ చేయాల్సిన ప్ర‌తిపక్షంలో నాయ‌కులు కూడా ఎక్క‌డా హ‌ద్దుల్లో ఉండ‌డం  లేదు. ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తిని దూషించిన విధానం అస్స‌లు స‌భ్య‌స‌మాజం అంగీకరించేలా లేదు. ఇదే త‌రుణంలో టీడీపీ నాయ‌కులు గొడ‌వ‌ల‌ను పెంచుకుంటూ పోయేందుకు ప్రాధాన్యం ఇస్తూ పోతే ఇక పాల‌న అన్న‌ది గాలికి వ‌దిలేసిన చందంగానే త‌యార‌వుతుంద‌ని రాజకీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. కాస్త త‌గ్గి ఉంటే త‌ప్పేం ఉంది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: