ఏడేళ్ల క్రితం జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న గాయాలు ఇప్ప‌టికీ ప‌చ్చిగానే ఉన్నాయి. విభ‌జిత రాష్ట్రం క‌ష్టాల క‌డ‌లిలో ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అయితే రాష్ట్రం ఇబ్బందులు త‌న‌కేమీ ప‌ట్ట‌నట్టుగా కేంద్రం ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిర్లక్ష్య వైఖ‌రి అవ‌లంబిస్తోంది. త‌న‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలున్న బీహార్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తాజాగా బ‌హిరంగంగా  ప్ర‌క‌టించిన బీజేపీ నాయ‌క‌త్వం ఏపీ మాత్రం ఆ లిస్టులో లేద‌ని బాహాటంగానే చెప్పేసింది. ఎందుకు వ‌చ్చిందీ దుస్థితి అంటే క‌నిపించే కార‌ణం ఒక‌టే. అది రాష్ట్ర విభ‌జ‌న‌. తెలుగువారు రెండు ముక్క‌లు కావ‌డం. త‌ద్వారా ఢిల్లీ స్థాయిలో వారి ప‌లుకుబ‌డి, ప్రాభ‌వం త‌గ్గ‌డం. తెలంగాణకు సంబంధించినంతవ‌ర‌కు రాష్ట్ర విభ‌జ‌న ఉద్య‌మాలు చేసి, త్యాగాల కోర్చి సాధించుకున్న‌ది కాబ‌ట్టి వారిని త‌ప్పుప‌ట్ట‌లేం. హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రం ఆదాయ మార్గంగా ఉంది కాబ‌ట్టి తాత్కాలికంగా ఇబ్బందులుండ‌క‌పోవ‌చ్చు. కానీ భ‌విష్య‌త్తులో ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి తిప్ప‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఆ వివ‌క్ష ఏంటో వారికి ఇప్ప‌టికే క‌నిపిస్తోంది కూడా.  

            అస‌లు ప్రాంతీయ పార్టీల‌ను క‌నుమ‌రుగు చేసేందుకు జాతీయ పార్టీలు  ఉమ్మ‌డిగా చేసిన కుట్ర‌లో భాగ‌మే రాష్ట్ర విభ‌జ‌న అంటూ నాడు సీమాంధ్రకు చెందిన కొంద‌రు మేధావులు చేసిన వాద‌నలో వాస్త‌వం నెమ్మ‌దిగా క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం జాతీయ‌ రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా ఉత్త‌ర‌భార‌తీయ నాయ‌కుల ఆధిప‌త్యానికి స‌వాల్ విసురుతూ ప్ర‌ధాన భూమిక పోషిస్తూ వ‌చ్చింది.  డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, నీలం సంజీవ‌రెడ్డి వంటి నాయ‌కులు రాష్ట్ర‌ప‌తి వంటి అత్యున్న‌త స్థానాల‌ను అధిరోహించారు. ఆ త‌రువాత మ‌హానాయకుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఆవిర్భావం త‌రువాత జాతీయ స్థాయిలో విప‌క్షాల‌ను ఐక్యం చేసి కాంగ్రెస్ ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యానికి గండికొట్టింది. కేంద్రంలో ప్ర‌భుత్వాల ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించింది. ఇందుకు కార‌ణం నాడు 42 మంది ఎంపీలు రాష్ట్రానికి ఉండ‌టం. ఇదే జాతీయ పార్టీల‌కు కంట‌గింపుగా మారింది. ప్ర‌త్యేక‌ తెలంగాణవాదాన్నిఆ కార‌ణంగానే కాంగ్రెస్‌, బీజేపీలు త‌మ‌కు అనువుగా ఉప‌యోగించుకుని రాష్ట్ర విభ‌జ‌న‌కు పాల్ప‌డ్డాయి. విడిపోయాక స‌హ‌జంగానే ఇరు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు రాష్ట్రాల‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌యోగ‌శాల‌లుగా మార్చేశాయి. అయితే ఈ ఆట‌లో కాంగ్రెస్ తీవ్రంగా న‌ష్ట‌పోగా..బీజేపీ ఏమాత్రం ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌దనేది భ‌విష్య‌త్తులో తేల‌నుంది. ఒక‌టి మాత్రం నిజం ఈ క్రూర‌మైన రాజ‌కీయ క్రీడ‌లో దారుణంగా న‌ష్ట‌పోయింది మాత్రం సీమాంధ్ర ప్ర‌జ‌లు.


మరింత సమాచారం తెలుసుకోండి: