జనసేన పవన్ కల్యాణ్ సిన్సియారిటి ఏమిటో తాజాగా బయటపడింది. విశాఖపట్నంలోని స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తానొక్కడే పోరాటం చేస్తున్నట్లు పవన్ పెద్ద బిల్డప్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 18-20 తేదీల మధ్య ప్రైవేటీకరణను నిరసిస్తు ట్విట్టర్లో పోస్టులు పెట్టి వాటిని వైసీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పిలుపిచ్చారు. దానికి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని జనసేన వర్గాలు జబ్బలు చరుచుకుంటున్నాయి. నిజానికి ఎంపీలను ట్యాగ్ చేయటం వల్ల ఉపయోగం ఏమిటో పవన్ కే తెలియాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిరసన పోస్టులను వైసీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేసేబదులు చేసేదేదో నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ఖాతాకే ట్యాగ్ చేయచ్చు కదా. అప్పుడైనా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై జనాల్లో ఎంత ఆగ్రహం ఉందో నరేంద్రమోడీకి అర్ధమవుతుంది. ఎంపీలకు ట్యాగ్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలుసు. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నది నరేంద్రమోడి అయితే ఆయన్ను వదిలిపెట్టి మిగిలిన వారిని అడుగుతామని, నిరసనలు తెలుపుతామని చెప్పటమేంటో అర్ధం కావటంలేదు.
పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ ఢిల్లీకి వెళ్ళి ఒక్కసారి కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానితో మాట్లాడింది లేదు. పోనీ రాష్ట్రంలో అయినా మీడియా సమావేశం పెట్టి ప్రైవేటీకరించద్దని మోడీని డిమాండ్ చేశారా అంటే అదీలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా కనీసం చిన్నపాటి నిరసన కూడా చేయలేకపోయారు. ఇలాంటి పవన్ తాను పార్టీ పెట్టిందే ప్రశ్నించేందుకని సొల్లుకబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంతకాలం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించారు. కేంద్రానికి సంబంధించిన అంశాల్లో కూడా ఇపుడు జగన్నే ప్రశ్నిస్తున్నారు. అంటే పవన్ లెక్క ఏమిటంటే ఎప్పుడైనా జగన్నే ప్రశ్నించాలన్నట్లుగా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో జగన్ను ప్రశ్నించటంలో తప్పేలేదు. కానీ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా జగనే బాధ్యుడని పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. తాజా నిర్ణయంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో పవన్ సిన్సియారిటి ఏమిటో జనాలకు అర్ధమైపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి