
బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సమాజ్వాదీ పార్టీలో చేరిన సమయంలో ఏర్పాటు చేసిన సభలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సమాజ్వాద్ (సోషలిజం) ద్వారా రామరాజ్యానికి మార్గమని, సమాజ్వాద్ ఏర్పాటైన రోజునే రాష్ట్రంలో ‘రామరాజ్యం’ ఏర్పాటవుతుందని.. శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి తన కలలోకి వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పారు. యూపీలో యోగి ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆయన ఆరోపించారు. అయితే, దేశంలో ప్రస్తుతం హిందువులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభం కావడం.. మధుర ఆలయ నిర్మాణం, బృందావనం నిర్మాణం చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే హామీలు ఇస్తున్న వేళ.. అఖిలేష్ హిందువులను తనవైపు తిప్పుకోవడానికి చూస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీకృష్ణుడు తనతో మాట్లాడినట్టు చెప్పుకుంటున్నాడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ఓ సభలో తాను పండిట్ అని చెప్పుకోవడానికి చొక్కాపై జంజం ధరించిన విషయం తెలిసిందే.. అలాగే, ఎన్నడు ఆలయాలకు వెళ్లని రాహుల్ తొలిసారిగా ఆలయాన్ని సందర్శించారు.