షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల హీట్ బాగా పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడనే చెప్పాలి. జగన్ అధికారంలోకి వచ్చినదగ్గరనుండి ఎప్పుడెప్పుడు జగన్ను దింపేద్దామా అనే ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో అడ్డుకుంటున్నారు. విచారణలో భాగంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లోమీడియాలో బాగా హైలైట్ చేయిస్తు ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సరే చంద్రబాబు ఆలోచనలు ఎలాగుంటాయో, ఎల్లోమీడియా జీవితధ్యేయం ఏమిటో జగన్ కు బాగా తెలుసుకాబట్టి పెద్దగా పట్టించుకోవటంలేదు. కానీ తనకున్న మీడియా పవర్ తో చంద్రబాబు మాత్రం రెగ్యులర్ గా రాజకీయంగా ప్రభుత్వాన్ని, జగన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రయత్నాలు జరుగుతుండగానే ప్రభుత్వం తాజా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.
మొదటినుండి జగన్ నమ్ముకున్న నవరత్నాలకే బాగా ప్రధాన్యతిచ్చారు. ఇదికాకుండా ప్రత్యేకంగా బీసీ, కాపులకు మ్యాగ్జిమమ్ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ ఉపప్రణాళికకు రు. 29,143 కోట్లు, కాపుల సంక్షేమానికి రు. 3,532 కోట్లు కేటాయించారు. వైసీపీకి మొదటినుండి ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలు బాగా మద్దతిస్తున్నారు. కాపుల మద్దతుగా అటు ఇటుగా ఉంది. ఇక బీసీల మద్దతు కూడా కొంతమాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల్లో బీసీలను టీడీపీకి పూర్తిగా దూరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే రికార్డు మొత్తంలో కేటాయించినట్లు తెలిసిపోతోంది.
అలాగే కాపులను మ్యాగ్జిమమ్ ఆకర్షించటంలో భాగంగానే సంక్షేమం పేరుతో వేల కోట్లు కేటాయించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వైపు కాపులు నడవకుండా అడ్డుకోవటమే జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేనకు పడిన ఓట్లలో అత్యధికం కాపులవే. అయితే 2024 ఎన్నికల్లోగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలీదు. అందుకనే బీసీలను, కాపులను వైసీపీకి గట్టి మద్దతుదారులుగా చేసుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎవరెన్ని విమర్శలు చేస్తున్న సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు చేశారు. మరి జగన్ ప్లాన్ వర్కవుటవుతుందా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి