ఒక్కదెబ్బకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరువంతా పోయింది. పరువుపోయిందనే కన్నా మిత్రపక్షం బీజేపీయే పరువు తీసేసిందని చెప్పటం కరెక్టేమో. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు, మత ప్రచారకుడు కేఏ పాల్ ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు బీజేపీ+జనసేన పొత్తుల గురించి తనతో హోంమంత్రి చేసిన కామెంట్ ఏమిటో  చెప్పారు.





ఇంతకీ ఆ కామెంట్ ఏమిటయ్యా అంటే పొత్తుల గురించి పాల్ ప్రస్తావించారట. 2 శాతం కూడా ఓటుబ్యాంకు లేని పవన్ తో పొత్తుగురించి బీజేపీ ఎందుకు వెంటపడిందని పాల్ ప్రశ్నించారట. దానికి మంత్రి సమాధానమిస్తు పొత్తు కోసం తాము పవన్ వెంటపడలేదని, పవనే తమ వెంటపడి పొత్తు పెట్టుకున్నట్లు అమిత్ షా చెప్పినట్లు పాల్ చెప్పారు. నిజానికి పాల్ చెప్పిందాంట్లో కూడా కొంత అనుమానముంది. ఎందుకంటే అమిత్ షా చెప్పిందే నిజమైతే మరి బీజేపీకి ఉన్న ఓటుబ్యాంకు ఎంత ?





మొన్నటి ఎన్నికల్లో కమలంపార్టీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం. దీన్నిబట్టి చూస్తుంటే కమలంపార్టీకన్నా 5.6 శాతం ఓట్లు తెచ్చుకున్న జనసేన మంచి పొజిషన్లోనే ఉన్నట్లు కదా. సరే ఓటుబ్యాంకును, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారనే విషయాన్ని వదిలేస్తే ప్రతి విషయంలోను బీజేపీ చెప్పినట్లే పవన్ ఎందుకు వింటున్నారన్నది చాలామందికి అర్ధంకాలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గట్టిగా చెప్పగానే పవన్ తన అభ్యర్ధులను ఉపసంహరించుకుంది.





అలాగే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీకి పట్టుబట్టి చివరకు పోటీచేసే అవకాశాన్ని బీజేపీకి వదిలేసింది. తర్వాత బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేసి తీరుతామని చెప్పిన జనసేన ఇక్కడ కూడా బీజేపీకే మద్దతివ్వాల్సొచ్చింది. చివరకు వైసీపీపై  పోరాడేందుకు కూడా బీజేపీ నుండే రోడ్డుమ్యాప్ రావాలని పవన్ ఎదురుచూస్తున్నారు. ఓటుబ్యాంకు విషయం తప్ప పవనే వెంటపడి బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు కాబట్టి ప్రతి విషయంలోను తలూపటం తప్ప చేయగలిగేదేమీ లేదని అర్ధమైపోతోంది. మూడూసార్లు ఢిల్లీకి వచ్చి అపాయిట్మెంట్ కోరినా అమిత్ షా ఇవ్వలేదంటేనే పవన్ను బీజేపీ ఎంతచిన్న చూపుచూస్తోందో అర్ధమైపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: