సమైక్య రాష్ట్రంలో అయినా విభజన ఏపీలో అయినా శ్రీకాకుళంకు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. ప్రతిఒక్కరికీ సిక్కోలు సెంటిమెంటే కలిసొస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదలుకొని ఇప్పటి మంత్రుల పర్యటనల వరకు అందరికీ శ్రీకాకుళమే అచ్చొచ్చినట్లుంది. ఇపుడు విషయం ఏమిటంటే 26వ తేదీన సామాజికన్యాయాన్ని చాటిచెప్పేందుకు 17 మంది మంత్రుల బృందం బస్సుయాత్ర చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.






సామాజికన్యాయం బస్సుయాత్రను మంత్రుల బృందం శ్రీకాకుళం నుండే మొదలుపెట్టబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన పాదయాత్రకు ముగింపు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలోనే వేదికైంది. అలాగే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్రను కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ముగించారు. జగన్ జైలులో ఉన్నపుడు పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర ముగింపుకు శ్రీకాకుళంనే ఎంచుకున్నారు.





చంద్రబాబునాయుడు కూడా తన ‘వస్తున్నామీకోసం’ బస్సుయాత్రలో  శ్రీకాకుళంకు బాగానే ప్రాధాన్యతిచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో శ్రీకాకుళం జిల్లాకు జగన్ బాగానే ప్రాధాన్యతిచ్చారు. 10 నియోజకవర్గాలున్న జిల్లాకు రెండు మంత్రిపదవులు, ఒక స్పీకర్ పదవిని ఇచ్చారంటేనే ప్రాధాన్యత అర్ధమవుతోంది. రాష్ట్రంలో రెండే ప్రాంతాలు సెంటిమెంటుగా పాగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శ్రీకాకుళం, తిరుపతి నియోజకవర్గాలకే ఏ పార్టీ అధినేతలైనా ప్రాధాన్యత ఇస్తున్నారు.






పాదయాత్ర, బస్సుయాత్ర..యాత్ర ఏదైనా సరే ముగియగానే వెంటనే తిరుపతికి చేరుకుని తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిందే. అప్పట్లో వైఎస్ అయినా ఈమధ్య జగన్ అయినా చేసిందిదే. రాజకీయాలంటేనే సెంటిమెంటుతో కూడుకున్న వ్యవహారం. అందులో ఒకసారి ఒకరికి అచ్చొచ్చిందని పేరుపడితే ఇక మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయిపోవాల్సిందే. పార్టీల అధినేతల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ సెంటిమెంటును ఫాలో అయినట్లు లేదు. అంతకుముందు ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి కూడా శ్రీకాకుళం సెంటిమెంటును ఫాలో అవలేదు. అందుకేనేమో సోదరులిద్దరు రాజకీయాల్లో ఫెయిలయ్యారన్నట్లుగా ముద్రపడిపోయింది.





మరింత సమాచారం తెలుసుకోండి: