వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ల ఖరారు విషయంలో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే అక్టోబర్ లోగా చాలావరకు టికెట్లను ఖరారు చేసేయాలని జగన్ డిసైడ్ చేశారట. ఇందులో భాగంగానే ప్లీనరీలో టికెట్ల ప్రకటన మొదలైపోయింది. కుప్పంలో ఎంఎల్సీ భరతే పోటీచేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. బాగా వివాదాస్పదమైన గన్నవరం నియోజవర్గంలో టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీయే పోటీచేస్తారని మాజీమంత్రి కొడాలి నాని ప్రకటించారు.





అలాగే కొద్దిగా గొడవల్లో ఉన్న రాజోలు నియోజకవర్గానికి ఇన్చార్జిగా జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ నే నియమిస్తు ఎంఎల్ఏ పొన్నాడ ప్రభాకర్ ప్రకటించారు. అంటే రాపాకనే వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ అభ్యర్ధిగా ప్రకటించినట్లే అనుకోవాలి. ఈ మూడు పేర్లుకూడా జగన్ పేరుమీదనే ప్రకటించారు. అంటే ఇలాగే రెగ్యులర్ గా ఎంఎల్ఏ అభ్యర్ధులను ప్రకటించేయాలని జగన్ డిసైడ్ చేశారు. దీనికి ప్లీనరీ సమావేశాలను వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు.





జూలై 8,9 తేదీల్లో జరగబోయే ప్లీనరీ సమావేశాల్లో చాలా టికెట్ల విషయంలో జగన్ క్లారిటి ఇచ్చేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరీ వివాదాస్పదమైన నియోజకవర్గాలను మాత్రం జగన్ పెండింగ్ లో పెడతారట. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా చాలా టికెట్ల విషయంలో అక్టోబర్ లోగా క్లారిటి వచ్చేస్తుందట.





అభ్యర్ధుల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు మొదలయ్యే అవకాశాలున్నాయని జగన్ అంచనా వేశారట. ఆ వివాదాలను పరిష్కరించే బాద్యతలను కూడా జగన్ జిల్లాల సమన్వయకర్తలపైనే పెట్టారట. ఒకవేళ సమన్వయకర్తల స్ధాయిలో సెటిల్ కాని వివాదాలను మాత్రమే జగన్ టేకప్ చేయాలని అనుకున్నారు. ఎంఎల్ఏల టికెట్ల కేటాయింపు తర్వాతే ఎంపీ అభ్యర్ధులను ఫైనల్ చేయబోతున్నారు. అక్టోబర్ లోపు అన్నీ సెటిల్ అయిపోతే ఇక అభ్యర్ధులు స్వేచ్చగా నియోజకవర్గాల్లో పర్యటించటం, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకోవాలని జగన్ చెప్పారట. మొత్తంమీద జగన్ వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు. మరీ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: