ఏమాత్రం ఊహించని రీతిలో తెలంగాణా హైకోర్టు కేసీయార్ కు భారీ షాకిచ్చింది. ఎంఎల్ఏల కొనుగోలు ఆరోపణలను విచారిస్తున్న సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్)ను కోర్టు రద్దుచేసింది. సిట్ విచారణను రద్దుచేసిన హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. వెంటనే సిట్ తన విచారణను నిలిపేయాలని అంతేకాకుండా విచారణలో సేకరించిన ఫైళ్ళు, ఆధారాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని కూడా ఆదేశించింది.





హైకోర్టు తాజా ఆదేశాలతో కేసీయార్ కు ఒకవిధంగా దిమ్మతిరిగినట్లే అనుకోవాలి. టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోళ్ళ కేసు విచారణకు సిట్ ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సిట్ ఏర్పాటు ద్వారా కొనుగోళ్ళ బేరాల్లో ఎవరిపేర్లు వినిపిస్తే వాళ్ళందరికీ నోటీసులిచ్చి విచారణకు రప్పిచాలన్నది కేసీయార్ వ్యూహం. ఇందులో భాగంగానే బీజేపీ కీలక నేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్ కు కూడా సిట్ తో నోటీసులిప్పించారు. పనిలో పనిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా నోటీసులు ఇవ్వబోతోందనే ప్రచారం కూడా జరిగింది.





ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న తన కూతురు కవిత జోలికి సీబీఐ రాకుండా  కేసీయార్ సిట్ ఏర్పాటుచేసి బీజేపీ పెద్దలను కంట్రోల్ చేస్తున్నారనే ప్రచారం ఇప్పటికే బాగా జరుగుతోంది. అయితే సీబీఐ కాకుండా ఈడీ వచ్చి కవితను విచారించి వెళ్ళింది. కేంద్ర దర్యాప్తు సంస్ధలను కేసీయార్ సిట్ ద్వారా ఎదుర్కొంటున్నారనే ప్రచారమైతే బాగా జరుగుతోంది. ముందుజాగ్రత్తగానే సీబీఐ ఎంట్రీని తెలంగాణాలో నిషేధిస్తు కేసీయార్ నిర్ణయం కూడా తీసుకున్నారు.





అయితే ఇపుడు హైకోర్టు ఆదేశాల కారణంగా సీబీఐ నిరభ్యంతరంగా రాష్ట్రంలోకి ఎంటరైపోతుంది.  హైకోర్టు ఆదేశాల కారణంగా కేసీయార్ ఆదేశాలను సీబీఐ ఇపుడు లెక్కచేయాల్సిన అవసరంలేదు. ఇదే సమయంలో సిట్ దర్యాప్తు పేరుతో వెళ్ళిన నోటీసులు చెల్లే అవకాశంలేదు. ఎందుకంటే హైకోర్టు సిట్ నే రద్దుచేసిన తర్వాత ఇక అదిచ్చిన నోటీసులు కూడా చెల్లవనే అంటున్నారు. మొత్తానికి దర్యాప్తు సీబీఐ చేతిలోకి వెళుతున్నందున ఇపుడు కేసీయార్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: