
ఎన్నికల ముందు కాలం ప్రతి పార్టీకి ఎంతో కీలకమైనది. పైగా టికెట్లు కేటాయించటం అన్నది పార్టీల అధినేతలకు కత్తిమీదసాములాంటిదే. అందుకనే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనే విషయంలో ఒకటికి పదిసార్లు సర్వేలు, ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటుంటారు. ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి ఒకమాట చెప్పారు. అదేమిటంటే టికెట్ దక్కని వాళ్ళు ఎవరు నిరుత్సాహ పడవద్దని. టికెట్లు దక్కిన వాళ్ళు, దక్కని వాళ్ళు కూడా తన మనుషులే అన్నారు. టికెట్లు దక్కనివాళ్ళకి వేరేరకంగా సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు.
అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ మూడు పాయింట్లున్నాయి. మొదటిది టికెట్లు ఇవ్వదలచుకోని వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. టికెట్లు దక్కనివాళ్ళు తిరుగుబాటు చేయవద్దని అలాంటివాళ్ళకి ఇతర పదవులు ఇస్తానని. మళ్ళీ అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని చెప్పటం ద్వారా టికెట్లు దక్కని వాళ్ళని పార్టీనుండి ఎవరు బయటకు వెళ్ళద్దని పరోక్షంగా చెప్పటమే. చివరగా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయం కాబట్టి టికెట్లు దక్కనివాళ్ళు తిరుగుబాటు లేవదేసే ఆలోచన మానుకోమని హెచ్చరించటమే.
ఈ మూడు పాయింట్లను మంత్రులు, ఎంఎల్ఏల మీటింగులో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. జగన్ చెప్పిన మూడుపాయింట్లు చేరాల్సిన వాళ్ళకి డైరెక్టుగానే చేరుంటాయి. ఎందుకంటే ఎవరెవరికి టికెట్లు ఇవ్వకూడదనే విషయంలో జగన్ ఈపాటికే క్లారిటితో ఉన్నారు. టికెట్లు దక్కవు అని కొందరు ఎంఎల్ఏలకు కూడా పూర్తి క్లారిటి ఉంది. అలాంటి వాళ్ళకోసమే జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు.
టికెట్ల కేటాయింపు విషయంలో కేసీయార్ ఎంతటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అందరు చూస్తున్నదే. టికెట్లు దక్కని కొందరు నేతలు పార్టీ మారిపోయారు. మరికొందరు పార్టీమారే ఆలోచనలో ఉన్నారు. ఇదేసమయంలో మరికొందరు పార్టీలోనే ఉండి తిరుగుబాటు లేవదీశారు. ఎన్నికల ముందు ఇలాంటివన్నీ ఏ పార్టీలో అయినా చాలా సహజమే. అందుకనే వైసీపీలో ఇలాంటివి తలెత్తకుండా జగన్ ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నట్లున్నారు. జగన్ ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా టికెట్లు దక్కవని కన్ఫర్మ్ అయిపోయిన సిట్టింగులు చేయకుండా ఉంటారా ?