రాబోయే ఎన్నికలు మొత్తం బీసీ సామాజికవర్గం చుట్టే తిరుగుతుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే మొత్తం జనాభాలో బీసీల జనాభా సగానికిపైగా ఉండటమే. అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించబోయే టికెట్లను పెంచాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. పోయిన ఎన్నికల్లోనే బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ 31 నియోజకవర్గాలు కేటాయించారు. సంప్రదాయంగా రెడ్డి, కమ్మ నేతలు పొటీచేసే సీట్లలో కూడా జగన్ బీసీలకు టికెట్లిచ్చారు. అప్పట్లో జగన్ చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది.





అదే పద్దతిలో వచ్చేఎన్నికల్లో కూడా బీసీలకు మరిన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయించారట. బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో సీటును అదనంగా కేటాయిస్తే ఎలాగుంటుందనే విషయాన్ని ఆలోచిస్తున్నారట.  అంటే పోయిన ఎన్నికల్లో కన్నా రాబోయే ఎన్నికల్లో అదనంగా తక్కువలో తక్కువ మరో 10 సీట్లు బీసీలకు ఎక్కువగా దక్కే అవకాశాలున్నాయని పార్టీలో టాక్ వినబడుతోంది. అంటే సుమారు 41 టికెట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని అర్ధమవుతోంది.





బీసీల కోటా పెరుగుతోందంటే ముందుగా దెబ్బపడేది రెడ్డి, కమ్మ సామాజికవర్గాల మీదే అనటంలో సందేహంలేదు. పోయిన ఎన్నికల్లో రిజర్వుడు సీట్లను తీసేస్తే రెడ్లకు 50 టికెట్లు, కాపులకు 35, కమ్మోరికి 17 సీట్లు, వైశ్యులకు 4, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ తదితర సామాజికవర్గాలకు తలా కొన్ని సీట్లను కేటాయించారు. ఇపుడు జగన్ ఆలోనలు అర్ధమవ్వటంతో టికెట్ల కోసం బీసీ నేతల్లో పోటీ పెరిగిపోతోంది. ఇపుడు జరుగుతున్న సామాజిక సాధికార బస్సుయాత్రలో కూడా వివిధ వర్గాల్లో ప్రత్యేకించి బీసీల్లో ఆదరణ స్పష్టంగా కనబడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.




అందుకనే జగన్ కూడా తరచూ రాబోయే ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తానని హామీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఛైర్మన్లుగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. జనరల్ సీట్లలో కూడా బీసీలకే అవకాశాలు ఇవ్వటంతోనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీకి అంత మెజారిటి వచ్చింది. కాబట్టి అదే పద్దతిని కంటిన్యుచేయటం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందాలన్నది జగన్ ఆలోచన. మరి ఎన్నిసీట్లు కేటాయిస్తారన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: