చంద్రబాబునాయుడు మీద బీజేపీ నేతలు కేంద్రపార్టీకి ఫిర్యాదు చేశారా ? పార్టీలోని నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి మాటలు విన్నతర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల రిజల్టు తర్వాత కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అలాగే కేంద్రమంత్రి అమిత్ షా తో కూడా భేటీ  అయినట్లు సమాచారం. ఓవరాల్ గా పార్టీ బలం మూడునుండి  ఎనిమిది సీట్లకు పెరిగిందన్నది ఒక పాయింట్.





ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు సంతోషిస్తున్నా అనుకున్నన్ని సీట్లు రాకపోవటంతో బాగా అసంతృప్తిగా ఉన్నారు. దీనికి కారణాల్లో చంద్రబాబు పాత్ర కూడా ఒకటని  చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. బీజేపీ+జనసేన పొత్తు పెట్టుకుని పోటీచేస్తే టీడీపీ మాత్రం కాంగ్రెస్ గెలుపుకు సహకరించిందని రిపోర్టులో చెప్పారట. కాంగ్రెస్ గెలుపుకు సహకరించటంలో భాగంగా టీడీపీ పోటీనుండే తప్పుకున్నట్లు రిపోర్టులో ఉందట. కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారంలో టీడీపీ నేతలు పాల్గొనటం, గాంధీభవన్లో టీడీపీ జెండాలు, బ్యానర్లున్న ఫొటోలు, వీడియోలను కూడా చూపారట.





కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపును టీడీపీ దెబ్బకొట్టిందని ఆధారాలతో సహా చెప్పారని సమాచారం. ఇదే విషయాన్ని విష్ణు మీడియా సమావేశంలో ప్రస్తావించారు. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ సపోర్టుచేయటం రాజకీయ తప్పిదంగా విష్ణు ఆరోపించారు. బీజేపీ, జనసేన అభ్యర్ధులకు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేయటం, పనిచేయటం పెద్ద తప్పని విష్ణు అభివర్ణించారు. ఈ విషయంలో ఇప్పటివరకు అధ్యక్షుడురాలు దగ్గుబాటి పురందేశ్వరి నోరిప్పలేదు.





తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేసిన టీడీపీతో ఏపీలో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలని సూటిగానే ప్రశ్నించారు. అంటే బీజేపీతో పొత్తుకోసం ఒకవైపు ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ గెలుపుకు పనిచేయటం ఏమిటన్నది  విష్ణు పాయింట్. అయితే ఈ విషయాన్ని ఆయన డైరెక్టుగా  మాట్లాడలేదు. నిజానికి బీజేపీకి టీడీపీకి ఎలాంటి సంబంధంలేదు. కాబట్టి టీడీపీ ఎవరికి పనిచేసినా బీజేపీ అడిగేందుకు లేదు. అయినా బాహాటంగానే చంద్రబాబును విష్ణు తప్పుపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: