అధికారపార్టీలోని కొందరు సీనియర్ల వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని చాలాకాలంగా కొందరు సీనియర్లు జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్టుచేస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి  వారసులకు టికెట్లు ఇచ్చేదిలేదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. ఒక్కసారికి సీనియర్లే పోటీచేయాలని కూడా చెప్పారు. దాంతో చేసేదిలేక సీనియర్లు నోరెత్తలేకపోయారు. అయితే తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాల్లో కొందరు సీనియర్ల వారసులకు జగన్ టికెట్లు ప్రకటించటంతో మరికొందరు సీనియర్లలో అసంతృప్తి మొదలైందట.





రెండోజాబితాలో ప్రకటించిన 27 మంది పేర్లలో ఐదుగురు వారసులను ఇన్చార్జిలుగా ప్రకటించారు. ఇన్చార్జన్నా లేకపోతే సమన్వయకర్తన్నా రాబోయే ఎన్నికల్లో టికెట్ దాదాపు ఖాయమన్నట్లే లెక్క. ఈ లెక్కన చూస్తే తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డికి బదులు ఆయన కొడుకు అభినయరెడ్డిని ప్రకటించారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బదులు మోహిత్ రెడ్డిని నియమించారు. మచిలీపట్నంలో పేర్నినాని స్ధానంలో ఆయన కొడుకు పేర్నికిట్టూని ప్రకటించారు. రాజ్యసభ ఎంపి పిల్లిసుభాష్ చంద్రబోస్ కొడుకును రామచంద్రాపురంలో ఇన్చార్జిగా ప్రకటించారు. గుంటూరు ఈస్ట్ లో ముస్తాఫాకు బదులు ఆయన కూతురుని నియమించారు.





ఇపుడిదే అంశంపై మరికొందరు సీనియర్లు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ లో అసంతృప్తి మొదలైందట. ఎందుకంటే వీళ్ళు కూడా తమ వారసులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. అయితే వీళ్ళకు జగన్ నో చెప్పేశారు. దాంతో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. కొందరు వారసులకు టికెట్లు ప్రకటించి తమ వారసులకు మాత్రం ఎందుకు టికెట్లు ప్రకటించలేదని జగన్ను అడగాలని అనుకుంటున్నట్లు సమాచారం.





ఎమ్మిగనూరు ఎంఎల్ఏ చెన్నకేశవరెడ్డి తన కొడుక్కి, ప్రత్తిపాడు ఎంఎల్ఏ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తన భార్య లేదా కూతురికి టికెట్ల ఇవ్వాలని ఎంతో ఒత్తిడిపెట్టారు. అయితే జగన్ మాత్రం అసలు ఎంఎల్ఏలకే టికెట్లు నిరాకరించారు. ఇలా ఒక్కొక్కళ్ళ విషయంలో జగన్ ఒక్కోలాగ వ్యవహరిస్తుండటంపై పార్టీలో చర్చయితే మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉందికాబట్టి అసంతృప్తితో ఉన్న సీనియర్లను పిలిపించి జగన్ మాట్లాడుతారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: