జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కొత్త తలనొప్పి మొదలైంది. ఒక్కరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో ఈ తలనొప్పి స్పష్టంగా బయటపడింది. వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కీలకమైన నేతలతో పవన్ భేటీ అయ్యారు. జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాలపైన చూయాయగా హింట్ ఇచ్చారని పార్టీవర్గాల సమాచారం. ఏ నియోజకవర్గంలో ఎవరిని పోటీచేయిస్తే బాగుంటుందనే చర్చ కూడా జరిగిందట.





ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన మధ్య వివాదాలు తలెత్తే నియోజకవర్గాలు తక్కువనే చెప్పాలి. పెందుర్తి, యలమంచిలి, విశాఖ తూర్పు, పాయకరావుపేట, భీమిలీ నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త వివాదముంది. అయితే ఇవన్నీ ఒకఎత్తయితే అనకాపల్లి పార్లమెంటు మరో ఎత్తు. అనకాపల్లి పార్లమెంటులో టికెట్ హామీతోనే సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. కొణతాల పార్టీలో చేరేసమయంలో పవన్ చాలా హడావుడి చేశారు. చేరిన దగ్గర నుండి కొణతాలల ఎంపీ అభ్యర్ధిగా నియోజకవర్గంలో తిరిగేశారు.





అయితే సడెన్ గా పవన్ సోదరుడు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటుకు పోటీచేయబోయేది తానే అన్న విషయాన్ని బయటకు చెప్పకనే చెప్పేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో రెగ్యులర్ గా సమీక్షలు చేస్తున్నారు. దాంతోనే అనకాపల్లిలో పోటీపై నాగబాబు ప్లాన్ చేశారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఒకేసీటు విషయంలో అటు కొణతాల ఇటు నాగబాబు ఇద్దరు పోటీచేస్తే పవన్ ఎవరికి మద్దతివ్వాలి ?





ఇపుడిదే మొదలైన  కొత్త తలనొప్పి. నాగబాబు వైఖరితో ఇఫ్పటికే అలిగిన కొణతాల పార్టీ  కార్యక్రమాల్లో పెద్దగా కనబడటంలేదు. ఇపుడు వ్యవహారంపై తేల్చిచెప్పాల్సిన బాధ్యత పవన్ పైన పడింది. ఇపుడు తేల్చిచెప్పకపోతే ముందు  ముందు చాలా సమస్యలు పెరిగిపోతాయి. పవన్ చెప్పే పెదరాయుడు తీర్పు ఎలాగ ఉండబోతోందనే విషయంపైన అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. కొణతాల లాంటి నేతలు జనసేనలో ఇంకా ఎంతమంది ఉన్నారు ? వాళ్ళ విషయంలో కూడా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: