సీట్ల సర్దుబాబు అధికారికం కాకముందే రెండుపార్టీల మధ్య వివాదాలు బాగా ముదిరిపోతున్నాయి. మొదటే పొత్తు పెట్టుకోవటం రెండుపార్టీల మధ్య నేతల్లో ఏమాత్రం ఇష్టంలేదు.  రెండు పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ నిర్ణయం అయిపోవటంతో నేతలు తప్పనిపరిస్ధితుల్లో ఆమోదించారు. అప్పటినుండి సీట్ల సర్దబాటులో నియోజకవర్గాల్లో రెండుపార్టీల నేతల మధ్య గొడవలు అవుతునే ఉన్నాయి.

ఇపుడు విషయం ఏమిటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేది తామేనంటే కాదు తామే అని రెండుపార్టీల నేతలు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో క్షేత్రస్ధాయిలో గొడవలైపోతున్నాయి. జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమం, మైలవరం, పెడన, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీనే పోటీచేస్తుందని జనసేన నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన ఎలాగ పోటీచేస్తుందని తమ్ముళ్ళు ఎదురుతిరుగుతున్నారు.

జిల్లాలో ఐదుసీట్లను జనసేనకు కేటాయించటానికి తమ్ముళ్ళు ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఇదే విషయాన్ని పదేపదే చంద్రబాబుతో గట్టిగా చెబుతున్నారు. ఇపుడు జనసేన మాత్రమే మిత్రపక్షం  కాబట్టి ఐదుసీట్లు ఇచ్చేస్తే రేపు బీజేపీ కూడా పొత్తులోకి ఎంటరైతే అప్పుడు ఇంకెన్ని సీట్లు కోల్పోతామో అనే భయం తమ్ముళ్ళని వెంటాడుతోంది. అందుకనే తప్పదని అనుకుంటే జనసేనకు ఎక్కడైనా ఒక్కసీటు  ఇస్తే సరిపోతుందని తమ్ముళ్ళు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే రెండుపార్టీల నేతలమధ్య గొడవలైపోతున్నాయి.

రేపటి పొత్తు సర్దుబాట్లలో ఏ సీటు ఎవరికి వెళిపోతుందో తెలీదు కాబట్టి చాలా నియోజకర్గాల్లో తమ్ముళ్ళు కాడి కిందపడేశారు. నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు పెద్దగా యాక్టివ్ గా లేరని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఒకవైపు వైసీపీలో అభ్యర్ధులు నియోజకవర్గాల్లో ప్రచారంతో దూసుకుపోతుంటే మరోవైపు తమ్ముళ్ళు, జనసేన నేతలు మాత్రం గొడవలతో బిజీగా ఉన్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే రేపటి సీట్ల సర్దుబాటులో గెలుపుకు రెండుపార్టీల నేతలు సహకరించుకుంటారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: