వెర్రి  వెయ్యిరకాలంటారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే టీడీపీలో సినియర్ తమ్ముడు బుద్ధా వెంకన్న గురించే. రాబోయే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుండి పోటీచేయటానికి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ కారణం వల్లనైనా రాకపోతే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి పార్లమెంటు టికెట్ అయినా ఇవ్వాల్సిందే అని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. బుద్ధా ఎంత గోలచేసినా, ఎన్ని డిమాండ్లు చేసినా టికెట్ దక్కే అవకాశంలేదని తేలిపోతోంది. ఎందుకంటే పై రెండు సీట్లు జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

అందుకనే సడెన్ గా ఓ పిచ్చిపని చేశారు. అదేమిటంటే రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్..నా ప్రాణం మీరే’ అంటు రక్తంతో గోడపైన రాశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు కటౌట్ దగ్గర చంద్రబాబు పాదాలను రక్తంతో కడిగారు. దానికి చంద్రబాబుకు  రక్తాభిషేకం అని ప్రకటించుకున్నారు. ఇదంతా చూసిన వాళ్ళకి టికెట్ దక్కదని తేలిపోయేసరికి పాపం బుద్ధాకు పిచ్చెక్కినట్లుందని కామెంట్లు చేస్తున్నారు. మరికోందరేమో బుద్దాకు పిచ్చెక్కిందా లేకపోతే చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని అనుమానిస్తున్నారు.

చంద్రబాబుకు బుద్ధా వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. చంద్రబాబు మద్దతుదారుడిగా ముద్రపడ్డారు కాబట్టే గతంలో ఎంఎల్సీ పదవి కూడా దక్కించుకున్నారు. జనంలో పెద్దగా బలంలేకపోయినా పార్టీలో మాత్రం కీలకనేతగా చెలామణి అయిపోతున్నారు. బీసీ కూడా అయిన బుద్ధాకు పార్టీలో గట్టి ప్రాధాన్యతే దక్కుతోంది. రక్తాభిషేకం తర్వాత మీడియాతో బుద్ధా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తనకు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి టికెట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వరు ? తనకు బలంలేదా ? డబ్బులేదా ? లేకపోతే ధైర్యంలేదా అని ప్రశ్నించారు.


ఏ కారణం వల్ల తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను తిరుగుబాటు చేసే వ్యక్తిని కాదన్నారు. తన అభిమాన నాయకుడు చంద్రబాబే అని బల్లగుద్ది మరీ చెప్పారు. మామూలుగా తమ అభిమాన నేతలు, సెలబ్రిటీల పుట్టినరోజు సందర్భంగా కటౌట్లకు పాలాభిషేకాలు చేయటమే అందరికీ తెలిసింది. రక్తాభిషేకం చేయటం మాత్రం ఇప్పటివరకు జరగలేదు. మొదటిసారి బుద్ధానే చంద్రబాబుకు రక్తాభిషేకం చేశారు. మరి పిచ్చి విధానం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: