మూడుపార్టీల మద్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఇప్పట్లో తేలేట్లులేవు. తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతలకు చెప్పిన విషయాన్ని బట్టి ఈ విషయం అర్ధమవుతోంది. ఇంతకీ పవన్ ఏమిచెప్పారంటే బీజేపీతో టీడీపీ పొత్తు విషయం మాట్లాడేందుకు ఢిల్లీకి తొందరలోనే వెళ్ళబోతున్నట్లు చెప్పారు. పొత్తుల గురించి ఫైనల్ చేసి తర్వాత సీట్ల సర్దుబాటు గురించి కూడా మాట్లాడి వస్తానని చెప్పారు. తొందరలోనే తాను ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారే కాని ఎప్పుడు వెళ్ళేది మాత్రం చెప్పలేదు.





తొందరలోనే అంటే రేపు కావచ్చు లేదా వారం పదిరోజులూ పట్టవచ్చు చెప్పలేం. ఎందుకంటే పవన్ ఢిల్లీకి వెళ్ళటం కాదు ముఖ్యం. ఢిల్లీలో బీజేపీ పెద్దలు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి రమ్మని పవన్ కు కబురురావాలి. అది రావటంలేదు కాబట్టే పవన్ ఇన్నిరోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్ధులను ఫైనల్ చేసి ప్రచారం కూడా చేసేస్తున్నారు. సిద్ధం పేరుతో మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించిన విషయం తెలిసిందే.





అవసరమైన నియోజకవర్గాల్లో అభ్యర్దులను మార్చటానికి కూడా జగన్ వెనకాడటంలేదు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంలో జగన్ ఇంత స్పీడుగా వెళుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులపై మాట్లాడేందుకు ఇంతవరకు ఒక్క సిట్టింగ్ కూడా జరగలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ముందు టీడీపీ ఎన్డీయేలో చేరాలి. ఆ తర్వాతే పొత్తు ముచ్చట్లు, సీట్ల సర్దుబాట్లు. అలాంటిది మొదటి అంకం టీడీపీ ఎన్డీయేలో చేరటమే కాలేదు. టీడీపీ  ఎప్పుడు ఎన్డీయేలో చేరుతుంది, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇంకెప్పుడు చర్చలు జరుగుతాయి.





మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లతో పాటు పోటీచేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ అవ్వాలి. ఆ తర్వాత చంద్రబాబునాయుడుకు అసలు సినిమా మొదలవుతుంది. పొత్తులు, సీట్లసర్దుబాట్లు చంద్రబాబుకు ఒకఎత్తు. ఇవన్నీ పూర్తయిన సీట్లు గల్లంతైన తమ్ముళ్ళ అలకలు, తిరుగుబాట్లు, బుజ్జగింపులు మరోఎత్తు. మొదటిది ఎంతముఖ్యమో రెండోదీ చంద్రబాబుకు అంతే ముఖ్యం. పవన్ తాజా కామెంట్ తర్వాత పొత్తులు, సీట్ల సర్దుబాట్లు తేలాలంటే కనీసం మార్చి మొదటి వారం అయిపోతుందేమో అనిపిస్తోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: