పార్టీలోని సీనియర్ తమ్ముళ్ళల్లో ఒకళ్ళయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు నారా లోకేష్ పెద్ద షాక్ ఇచ్చారట. రాబోయే ఎన్నికల్లో పోటీకి టికెట్ లేదని ఆలపాటికి లోకేష్ చెప్పేశారట. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ సీటులో పోటీచేసేందుకు మాజీమంత్రి గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఊహించని రీతిలో టికెట్ కోసం జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్ తెరపైకి వచ్చారు.

రాబోయే ఎన్నికల్లో తెనాలిలో తాను పోటీచేయబోతున్నట్లు నాదెండ్ల చాలా కాలం క్రితమే ప్రకటించారు. దాంతో ఆలపాటి-నాదెండ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరు నేతల మద్దతుదారులు ఒకళ్ళని  మరొకళ్ళు  తీవ్రంగా వ్యతిరేకించుకుంటున్నారు. ఇదే విషయమై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చల్లో టికెట్ విషయం మాట్లాడుకున్నారట. అయితే ఏమి జరిగిందో బయటకు  పొక్కలేదు. దాంతో ఇటు ఆలపాటి అటు నాదెండ్ల ఇద్దరు నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే రెండుపార్టీల  మధ్య సీట్ల  సర్దుబాటు చర్చలు మొదలైంది. అంతేకాకుండా మధ్యలో బీజేపీ కూడా దూరుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే లోకేష్ ను కలిసిన ఆలపాటి తెనాలి టికెట్ పై మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా తెనాలిలో జనసేన పోటీచేస్తుందని కుండబద్దలు కొట్టేశారట. జనసేన తరపున నాదెండ్ల  అభ్యర్ధిగా ఉంటారు కాబట్టి టీడీపీ పోటీలో ఉండటంలేదని తేల్చిచెప్పేశారట. దాంతో ఆలపాటికి షాక్ కొట్టినట్లయ్యింది. తెనాలి టికెట్ ఎగిరిపోయింది కాబట్టి అభ్యంతరం లేకపోతే గుంటూరు ఎంపీగా పోటీచేయమని సూచించినట్లు పార్టీలో టాక్ వినబడుతోంది.

అయితే గుంటూరు ఎంపీగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. చాలాకాలంగా గుంటూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక కార్యక్రమాలను సొంతడబ్బు పెట్టి నిర్వహిస్తున్నారట. చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టే తాను పోటీకి రెడీ అవుతున్నట్లు కూడా చెప్పుకుంటున్నారట. దాంతో తాను ఎక్కడి నుండి పోటీచేయాలో తేల్చుకోలేక ఆలపాటిలో అయోమయం పెరిగిపోతోంది. మొత్తానికి ఆలపాటి రాజకీయ జీవితానికి దాదాపు శుభంకార్డు పడినట్లే అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: