పార్టీలోని సీనియర్ మోస్ట్ రాజకీయనేతల్లో ఒకరైన ఎంఎల్ఏ  గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజకీయ జీవితం ముగిసినట్లేనా ? తాజాగా రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చూస్తే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నేతలతో పవన్ మాట్లాడుతు రెండు నియోజకవర్గాలకు అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ ను ప్రకటించారు. రాజానగరం నియోజకవర్గంలో కూడా జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు కాని అభ్యర్ధిని మాత్రం ఎనౌన్స్ చేయలేదు.

రాజమండ్రి రూరల్ అభ్యర్ధిగా కందులను ప్రకటించగానే అందరి దృష్టి గోరంట్ల మీదపడింది. ఎందుకంటే రాజమండ్రి నగరం, రూరల్ నియోజకవర్గాల్లో గోరంట్ల ఏడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో కూడా పోటీచేసి గెలవాలని పట్టుదలగా  పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజకీయాల నుండి తప్పుకోవాలని అనుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే అంతకుముందే గోరంట్ల రాజకీయజీవితానికి పవన్ ఎండ్ కార్డు వేసేసినట్లున్నారు. ఎలాగంటే గోరంట్ల పోటీచేయటానికి నియోజకవర్గంలేదు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేకపోతే సిటి లో అయినా టికెట్ ఇవ్వాలని చంద్రబాబునాయుడును చాలాసార్లు కోరారు. అయితే గోరంట్లను సిటీలో పోటీచేయించాలంటే చంద్రబాబుకు ఒక సమస్యుంది. అదేమిటంటే ఇక్కడ ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని. ఈమె శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెల్లెలు, పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు కూతురు వరసవుతుంది. కాబట్టి ఆమెను తప్పించలేరు. అయితే అసలు ఆమెకు కూడా టికెట్ వచ్చేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ సీటుపై బీజేపీ కన్నేసింది.

టీడీపీ, జనసేనతో పొత్తుంటే రాజమండ్రి సిటి నియోజకవర్గంలో పోటీచేయాలని బీజేపీ డిసైడ్ చేసుకున్నదట. అంటే రాజమండ్రి రూరల్లో జనసేన, సిటిలో బీజేపీ పోటీచేస్తుందని అర్ధమవుతోంది. దాంతో ఇద్దరు బలమైన నేతల రాజకీయ జీవితానికి శుభంకార్డు పడిపోవటం ఖాయమనే టాక్ మొదలైంది. వయసు రీత్యా 30ల్లో ఉన్న  భవానికి ఇంకో ఎన్నికలో అవకాశం వస్తుందేమో కాని గోరంట్లకు అవకాశంలేదు. ఎందుకంటే ఇప్పటికే గోరంట్ల వయసు సుమారు 75.  కాబట్టి ఏ కోణంలో చూసినా గోరంట్ల రాజకీయ జీవితం ముగిసినట్లే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: