రేవంత్ రెడ్డి ఒక్కసారిగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం  స్పీడు పెంచేశారు. కొడంగల్ బహిరంగసభలో మాట్లాడుతు వారంలోనే ఫ్రీ కరెంటు, రు.500 కే గ్యాస్ సిలిండర్ హామీలను అమల్లోకి తేబోతున్నట్లు ప్రకటించారు. అలాగే రు.2 లక్షల వరకు రైతు రుణమాఫీని కూడా పూర్తిచేయబోతున్నట్లు చెప్పారు. మొన్నటి అసెంబ్లీ  ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ ను రేవంత్ రెడ్డితో సహా మొత్తం కాంగ్రెస్ నేతలు సిక్స్ గ్యారెంటీస్ పైనే ప్రధానంగా ప్రచారంచేశారు. జనాలు కూడా కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మే అధికారం అప్పగించారు.

అధికారంలోకి రాగానే సిక్స్ గ్యారెంటీస్ లో ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన నాలుగు హామీల్లో రెండు రు. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ హామీలను వారంలోనే అమల్లోకి తచ్చేస్తామని ప్రకటించారు. నిజంగానే వారంలో అమల్లోకి వస్తే నాలుగు హామీలు అమలు చేసినట్లవుతుంది. తొందరలోనే రైతు రుణమాపీ రు. 2 లక్షల హామీని కూడా అమలు చేసేయాలని రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

రు. 500 గ్యాస్ సిలండర్, 200 యూనిట్లవరకు ఫ్రీ కరెంట్ అన్నది తెల్ల రేషన్ కార్డులున్న వాళ్ళందరికీ వర్తింపచేస్తామన్నారు. ఇదే సమయంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్ధిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల ప్రకటనను రేవంత్ మొదట తన జిల్లా నుండే ప్రారంభించటం గమనార్హం. మొత్తం 17 సీట్లలో 14 నియోజకవర్గాల్లో గెలిచి తీరాల్సిందే అని రేవంత్ గట్టిగా డిసైడ్ అయ్యారు. మరి మిగిలిన మూడు నియోజకవర్గాలను ఎందుకు ? ఎవరికోసం వదిలేశారో అర్ధంకావటంలేదు.

సిక్స్ గ్యారెంటీస్ హామీలన్నీ అబద్ధాలే అని హామీల అమలు సాధ్యంకాక కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే కుప్పకూలిపోతుందని కేటీయార్, హరీష్ తో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలు పదేపదే కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మిగిలిన నాలుగు హామీల అమలుపై రేవంత్ స్పీడుగా కసరత్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అమలుపై కసరత్తు పూర్తయినట్లుంది. అందుకనే వారంలోనే రెండు హామీలను అమలుచేస్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీ కూడా అమలైతే ఐదు హామీలు అమలు చేసినట్లవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకునే  హామీల అమలుకు రేవంత్ స్పీడు పెంచినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: