రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో జనసేన పోటీచేయబోయే సీట్లు ఫైనల్ అయిపోయాయి. 175 సీట్లలో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీచేయబోతోంది. అవటానికి ఇది మొదటి జాబితా అని చెప్పినప్పటికీ టీడీపీకి ఏమన్నా రెండో జాబితా, మూడో జాబితా ఉండచ్చు కాని జనసేనకు మాత్రం మొదటి తుది జాబితా అని అర్ధమైపోతోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమరెండు పార్టీలు కలిసి పోటీచేస్తున్నట్లు చంద్రబాబునాయుడు పదేపదే చెప్పుకున్నారు.

పోటీచేయబోయే అభ్యర్ధులతో మొదటిజాబితాలో 118 మంది పేర్లను ప్రకటించారు. టీడీపీ తరపున 94 మంది అభ్యర్ధుల పేర్లను చంద్రబాబు ప్రకటిస్తే జనసేన తరపున 24 నియోజకవర్గాలను పవన్ ప్రకటించారు. అయితే అభ్యర్ధులను మాత్రం ఐదు చోట్ల మాత్రమే ప్రకటించారు. ఇక్కడే పవన్ ఒక విచిత్రమైన ప్రకటనచేశారు. అదేమిటంటే జనసేన పోటీచేయబోయేది 24 నియోజకవర్గాల్లోనేనా అని నిరాస పడక్కర్లేదట. ఎందుకంటే జనసేన పోటీచేయబోయే 3 పార్లమెంటు సీట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకుంటే మొత్తం 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నట్లు అనుకోవాలట.

ఇక్కడే పవన్ చెప్పింది పిచ్చిలెక్కగా అర్ధమైపోతోంది. ఎలాగంటే జనసేన పోటీచేయబోయే 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని 3 పార్లమెంటు సీట్ల పరిధిలో ఉంటాయి. అంటే అసెంబ్లీ నియోజవర్గాలు 24 మాత్రమే అని స్పష్టంగా తెలుస్తోంది. దానికే పవన్ మసిపూడి మారేడుకాయ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. జనసేన పోటీచేయబోయేది 24 సీట్లేనా అనే చర్చ కాపు సామాజికవర్గంలో జరిగితే పార్టీ ఎక్కడ నష్టపోతుందో అన్న భయం పవన్లో స్పష్టగా కనబడుతోంది.

ఒకవైపు జనసేన తక్కువలో తక్కువ 50-60 సీట్లలో పోటీచేయాల్సిందే అని కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య లాంటి వాళ్ళు, కాపు ప్రముఖులు చాలాకాలంగా మొత్తుకుంటున్నారు. టీడీపీ ఇచ్చే 25 సీట్లను తీసుకుంటే కాపుల ఓట్లు టీడీపీకి ఎట్టి పరిస్ధితుల్లోను బదిలీకావని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఎంతమంది ఎంతమొత్తుకుంటున్నా పవన్ మాత్రం చంద్రబాబు ఇచ్చిన 24 సీట్లనే మహాప్రసాదంలాగ తీసుకున్నారు. పవన్ చేయాల్సిన పని ఆయన చేశారు. మరి కాపు సామాజికవర్గం జనసేన పోటీచేయబోయే సీట్లపై  ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: