రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీచేయబోయే ఐదు నియోజకవర్గాలను అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ+జనసేన ఉమ్మడి మొదటి జాబితాను చంద్రబాబునాయుడు, పవన్ ప్రకటించారు. 99 నియోజకవర్గాలకు రెండుపార్టీల అధినేతలు అభ్యర్ధులను ప్రకటించారు. ఇందులో టీడీపీ తరపున 94 మంది, జనసేన తరపున ఐదుగురు అభ్యర్ధులున్నారు. జనసేన తరపున తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజిని పవన్ ప్రకటించారు.





నిజానికి ఐదు నియోజకవర్గాల్లో అందరు అనుకుంటున్న పేర్లనే పవన్ ప్రకటించారు. అయితే గమనార్హం ఏమిటంటే తాను ఎక్కడినుండి పోటీచేస్తాననే విషయాన్ని మాత్రం పవన్ ఇంకా రహస్యంగానే ఉంచారు. ఒకవైపు భీమవరంలో పవన్ పోటీచేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పేస్తున్నాయి. ఈమధ్యనే బీమవరంలోని టీడీపీ నేతల ఇళ్ళకి వెళ్ళి తనకు మద్దతు ఇవ్వాలని పవన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అధికారికంగా పవన్ బీమవరంలో పోటీచేస్తున్నట్లు ప్రకటించలేదు కాని అందరికీ ఆ విషయం తెలుసు.





అలాంటి పవన్ తాను భీమవరంలో పోటీచేస్తున్నట్లు ఎందుకని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నారో అర్ధంకావటంలేదు. ఈరోజు కాకపోతే రేపైనా ప్రకటించాల్సిందే. ఈ విషయం తెలిసికూడా తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించకుండా రహస్యంగానే ఎందుకు ఉంచుతున్నారో తెలీటంలేదు.  పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ముందే ప్రకటిస్తే తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతారని పిఠాపురం రోడ్డుషోలో పవన్ ప్రకటించారు. తనను ఓడించటానికి జగన్ ఎప్పుడైనా ప్రయత్నిస్తారన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు.





కుప్పంలో చంద్రబాబునే ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ ఇక తనను గెలవనిస్తారని పవన్ ఎలాగ అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ఏరోజు ప్రకటిస్తే ఆరోజు నుండే ఓడించేందుకు జగన్ రెడీ అయిపోతారన్న విషయం పవన్ కు తెలీదా ?  ఏ నియోజకవర్గంలో పోటీచేస్తారో ప్రకటించేంత ధైర్యం కూడా లేని పవన్ చీటికి మాటికి జగన్ పైన నోటికొచ్చిన చాలెంజులు మాత్రం  చేసేస్తున్నారు. కుప్పంలో తాను, మంగళగిరిలో లోకేష్ పోటీచేస్తామని ప్రకటించిన చంద్రబాబుకున్న ధైర్యం కూడా పవన్ కు లేకపోతే ఎలా ?

మరింత సమాచారం తెలుసుకోండి: