మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య వైఖరి కాస్త భిన్నంగానే కనిపిస్తోంది. ఎలాగంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కెపాసిటీని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్థరించటానికే జన్మించిన అవతార పురుషుడన్నట్లుగా, కాపుల భవిష్యత్తంతా పవన్ భుజాలమీదే ఉన్నట్లుగా జోగయ్య చాలా ఫీలైపోతున్నారు. నిజానికి పవన్ కు అసలు ఎలాంటి కెపాసిటీలు లేవన్న విషయం పెద్దాయనకు అర్ధంకావటంలేదు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినపుడే పవన్ కెపాసిటీ ప్రపంచానికి అర్ధమైనా జోగయ్యకు మాత్రం కాలేదు.

ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో జనసేనకు చంద్రబాబునాయుడు 24 సీట్లుమాత్రమే కేటాయించారు. నిజానికి పవన్ హ్యాపీగానే ఉన్నారు కాని జోగయ్యే నానా గోలచేస్తున్నారు. జోగయ్య వ్యవహారం చూస్తుంటే ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుక’న్న సామెత గుర్తుకొస్తోంది. పార్టీ పెట్టినవాడికే ఎక్కువ సీట్లలో పోటీచేయాలని, అన్నింటిలోను గెలవాలని, ముఖ్యమంత్రి అవ్వాలని లేనపుడు 88 ఏళ్ళ జోగయ్య ఎందుకింత గోల చేస్తున్నారో అర్ధంకావటంలేదు. ఎవరెంత గోలపెట్టినా చంద్రబాబు చెప్పిందే పవన్ వింటారని చాలాసార్లు రుజువైంది.

సామాజికవర్గాలకు మించిన బంధమేదో వాళ్ళిద్దరి మధ్యా చాలా బలంగా ఉంది. అందుకనే తక్కువ సీట్లు తీసుకున్నందుకు జోగయ్య లాంటి కాపు ప్రముఖులు, పార్టీ నేతలు గోలచేస్తున్నా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. 24 సీట్లకు మించి జనసేనకు  నెగ్గే స్తోమత లేదా అని జోగయ్య ప్రశ్నించటంలో అర్ధంలేదు. జోగయ్య ప్రశ్నించాల్సింది 24 సీట్లకు మించి పోటీచేసే స్తోమత జనసేనకు ఉందా  లేదా అని.

ఎక్కువ సీట్లు తీసుకోవాలని, పోటీచేయాలని, గెలవాలని పవన్ కే లేనపుడు మిగిలిన వాళ్ళకు ఏమిటి బాధ ? పార్టీకి కర్త, కర్మ, క్రియ అంతా పవనే అయినపుడు తన డెసిషనే ఫైనల్. మిగిలిన వాళ్ళు ఎంత గోలచేసినా గొంతునొప్పి తప్ప ఇంకేమీ ఉపయోగముండదు. చంద్రబాబు 94 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించేశారు. మరి పవన్ మాత్రం అప్పటికప్పుడు పేపర్ మీద నాదెండ్ల రాసిచ్చిన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్ధులను మాత్రమే ఎందుకు ప్రకటించినట్లు ? ఎందుకంటే పవన్ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉందని తెలీటంలేదా ? పవన్ కు లేని కెపాసిటీని ఉందనుకుని, ఊహించుకుని జోగయ్య లాంటి వాళ్ళు ఊరికే గోలచేస్తున్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: