కాలం ఎల్లకాలం ఒకేలాగుండదు. అలాగే కాలం ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్లుగా నడుచుకోదు. ఈ విషయం మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుకు బాగా సరిపోతుంది. విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితుల సంఘం ఏర్పాటైంది. మార్గదర్శి చిట్స్ వేసి నష్టపోయిన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ సంఘంలో చేరవచ్చని సంఘం బాధ్యులు ముష్టి శ్రీనివాస్, సాంబశివరావు, అన్నపూర్ణాదేవి చెప్పారు.

మార్గదర్శిలో చిట్ వేసి తాము ఎలాగ ఇబ్బందులు పడుతున్నామో వివరించి చెప్పారు. ఏజెంట్ల టార్గెట్లను రీచయ్యేందుకు ఖాతాదారులకు మాయమాటలు చెప్పి ఎక్కువ చిట్ అమౌంట్లలో చేర్పించినట్లు వాపోయారు. ఎక్కువ అమౌంట్లలో చిట్లు వేసి వాటిని కట్టలేక తాము నానా అవస్తలుపడ్డామని చివరకు చిట్ టమౌంట్ కు అవసరమని చెప్పి తమ ఇళ్ళని కూడా ఎటాచ్ చేసినట్లు అన్నపూర్ణదేవి చెప్పారు. కోర్టుకు వెళ్ళేందుకు కూడా లేకుండా అంతకుముందే తమ దగ్గర తీసుకున్న సంతకాలను సంస్ధ తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నట్లు ముష్టి ఆరోపించారు.

చిట్లో చేరేట్లుగా ఏవేవో ఆశలు చూపించి తర్వాత ఆస్తులను మార్గదర్శి కొల్లగొడుతోందని సాంబశివరావు ఆరోపించారు. తనచేత 43 వేల చిట్లు వేయించి చివరకు తనకు ఇచ్చింది రు. 8 వేలన్నారు. తాను చేరిన చిట్లకు నెలకు రు.40 లక్షల నుండి రు. 50 లక్షలు కట్టేస్ధితికి తీసుకెళ్ళినట్లు సాంబశివరావు మండిపోయారు. తాము చిట్ డబ్బులు కట్టలేకపోతే కాల్ మనీ గూండాలు వచ్చినట్లుగా తమింటికి వచ్చి కూర్చుని బలవంతంగా డబ్బులు వసూలు చేసుకుని వెళతారని ఆయన బాధపడ్డారు.

తమపేరుతో చిట్లు వేసి తాము చిట్లు కట్టలేనంతగా ఎమౌంట్లు పెంచేసి చివరకు ఆస్తులు బలవంతంగా రాయించేసుకుంటున్నట్లు అన్నపూర్ణాదేవి ఆరోపించారు. మొత్తానికి మార్గదర్శి చిట్స్ బాధితులు ఒక్కోళ్ళుగా బయటకు వస్తున్నారు. ఇంతకాలం రామోజీకి చంద్రబాబునాయుడు  ప్రభుత్వంలో ఉన్న పలుకుపబడి కారణంగా అక్రమాలు,  ధౌర్జన్యాలేవి బయటకు రాకుండా మ్యానేజ్ చేసినట్లు అర్ధమవుతోంది. తొందరలోనే సుప్రింకోర్టులో మార్గదర్శి అక్రమాలపై విచారణ పూర్తవ్వబోతోంది. విచారణ పూర్తయితే ఎలాంటి శిక్షపడుతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: