ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి తెలుగుదేశం-జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‎లు చాలా సార్లు చర్చించారు. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలనే దానిపై రెండు పార్టీల అధినేతలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో మొత్తం ఆరు హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. గత సంవత్సరం రాజమండ్రిలో జరిగిన మహానాడులోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఆరు హామీలను మినీ మేనిఫెస్టోగా ప్రకటించారు. అప్పటి నుండి ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. టీడీపీ పొందుపరిచిన ఆరు హామీలకు అదనంగా షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన పార్టీ కూడా ఆరు ప్రతిపాదనలను జోడించింది. అయితే గత విజయదశమి నాటికే మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చంద్రబాబు నాయుడుపై కేసులు, జనసేన పార్టీతో పొత్తులతో మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది.


చంద్రబాబు-పవన కళ్యాణ్ లు ఉమ్మడి మేనిఫెస్టో‎పై క్లారిటీకి వచ్చినా కానీ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. అయితే దీనికి కారణం బీజేపీతో పొత్తుల అంశమే అంటున్నారు టీడీపీ నేతలు.ఇప్పటికే సీట్ల సర్ధుబాట విషయంలో బీజేపీ కోసం ఎదురచూస్తున్నాయి ఇరు పార్టీలు. అయితే బీజేపీతో పొత్తులపై క్లారిటీ అనేది వస్తే సీట్లను సర్ధుబాటు చేయాల్సి ఉంటుంది.ఇంకా అంతేకాదు మేనిఫెస్టోలో కూడా బీజేపీకి సంబంధించిన అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ కూడా వాయిదా పడుతుందనేది తెలుగుదేశం పార్టీ వర్గాల వాదన. పొత్తు కనుక ఖరారయినట్లయితే మేనిఫెస్టోపై ఆ పార్టీతో చర్చించాలి. ఏయే అంశాలతో ప్రజలకు హామీలు ఇవ్వాలనే దానిపై ఖచ్చితంగా అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ తర్వాతే పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టీడీపీ-జనసేన మేనిఫెస్టో రిలీజ్ తర్వాత బీజేపీతో జతకడితే మళ్లీ మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి మేనిఫెస్టో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. వచ్చే వారంలోగా పొత్తులపై క్లారిటీ వస్తుందని.. ఆ తర్వాతే మేనిఫెస్టో విడుదల ఉంటుందని చెబుతున్నారు రెండు పార్టీల ముఖ్య నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: