ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తనకున్న వ్యక్తిగత సంబంధాలతో ఏదోలా మాయచేసి చంద్రబాబునాయుడు పొత్తుపెట్టుకున్నారు. అయితే సీట్ల సర్దుబాటులో జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించటంతో వివాదం మొదలైంది. పొత్తులో భాగంగా మూడోవంతు సీట్లు అంటే 58 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోందని స్వయంగా పవనే ఇంతకుముందు ప్రకటించారు. కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య, పార్టీ నేతలు, కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు పవన్ మాటలను నమ్మారు. తీరాచూస్తే పవన్ తీసుకున్నది 24 సీట్లు మాత్రమే.

24 సీట్లు తీసుకున్న పవన్ పైన పార్టీ నేతలు, జోగయ్య, కాపు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దానికి సమాధానంగా జెండా సభలో పవన్ మాట్లాడుతు తన నిర్ణయాన్ని గౌరవించే వాళ్ళే పార్టీలో ఉండండి లేదా పొమ్మన్నారు. దాంతో పార్టీ నేతలతో పాటు కాపు ప్రముఖులు మండిపోతున్నారు. ఇదే విషయమై కాపు ఐక్యవేదిక నేతలు గట్టిగా సమాధానమిచ్చారు.  టీడీపీ ఆఫీసు ముందు పవన్ బొమ్మను నిలబెట్టినా టీడీపీకి కాపుల ఓట్లు పడవని  స్పష్టంగా వేదిక నేతలు ప్రకటించారు. జనసేన పార్టీకి జనబలంలేదని, ధనబలంలేదని పవన్తోనే  చంద్రబాబునాయుడు చెప్పించారని వేదిక నేతలు అభిప్రాయపడుతున్నారు.

పవన్ను మ్యానేజ్ చేసుకుంటే కాపుల ఓట్లు పడతాయనే భ్రమలో చంద్రబాబు ఉన్నట్లుగా వేదిక నేతలు మండిపోయారు. వేదిక నేతలే కాదు జనసేన పార్టీ నేతలు కూడా పవన్ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక కాపు సామాజికవర్గంలోని ప్రముఖులు జోగయ్య, ముద్రగడ పద్మనాభంతో పాటు చాలామంది కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావని చెబుతున్నారు. ఈ మాటలను చేగొండి, ముద్రగడ, ఐక్యవేదిక నేతలు రహస్యంగా కాదు బహిరంగంగానే చెబుతున్నారు.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకు పవన్ మాత్రమే మద్దతుగా నిలవబోతున్నట్లు అర్ధమవుతోంది. జనసేన నేతలు, కాపు సామాజికవర్గం దూరంగా జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. మరీ విషయాన్ని చంద్రబాబు, పవన్ గమనిస్తున్నారో లేదో. ఎన్నికల నాటికి జనంలేని, సైన్యంలేని నాయకుడిగా పవన్ ఒంటరిగా మిగిలిపోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: