బీ ఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు ఏది చేసినా ప‌క్కా మంచి రోజులు, ఘ‌డియ‌లు, మూహూర్తాలు చూసుకుని ప‌నిచేస్తుంటారు. వీటికి తోడు రాజ‌కీయ స‌భ‌లు పెడితే తూచా త‌ప్ప‌కుండా వాస్తు చూసుకుని వేధిక‌ను త‌యారు చేయిస్తారు. అలాంటి కేసీఆర్ ఈ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న కే సీ ఆర్ ఇప్ప‌టికే భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వహిస్తున్నారు. ఇక బీ ఆర్ ఎస్ అభ్య‌ర్థులుగా పోటీ చేసేవారికి బీ ఫారాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అందుకు మూహూర్తం కూడా నిర్ణ‌యించారు.

తెలంగాణ భవన్ వేదిక‌గా ఈనెల 18 వ తేదీ గురువారం నాడు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు,  బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బి ఫారాలు అందజేయనున్నారు.  అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ చైర్మన్లు,  పార్టీ రాష్ట్ర‌ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఆహ్వానితులందరికీ తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి, దానికి దారి తీసిన ప‌రిస్థితులు, ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితులు, కాంగ్రెస్ ప‌రిపాల‌న తీరు తెన్నుల‌ను ఈ స‌మావేశంలో కూలంకుశంగా చ‌ర్చించి, నేత‌ల‌కు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయ‌నున్నారు. అందుకు త‌గిన విధంగా, తెలంగాణ ప్రజల‌ ఆకాంక్షలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు.

ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజా స్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరింత చేరుకావాలని  కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ పాల‌న‌లో కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెల్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్  నిర్ణయించారు. ఇదే స‌మావేశంలో  కేసీఆర్  బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా కేసీఆర్ గెలుపే ల‌క్ష్యంగా పార్టీ నేత‌ల‌ను స‌మాయ‌త్తం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: