•అప్పుడు మిత్రులు ఇప్పుడు శత్రువులు..
•ఈ గురుశిష్యుల పోరులో పై చేయి ఎవరిది..
•తండ్రి ఇమేజ్ కావ్యను గట్టెక్కిస్తుందా..?


 ఒకప్పుడు వరంగల్ రాజకీయాల్లో పెద్దపీట పోషించినటువంటి వ్యక్తుల్లో కడియం శ్రీహరి కూడా ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈయనకు మంచి గుర్తింపు ఉంది..  కడియం శ్రీహరి ఎంతోమందికి రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చారు. ఆయన భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తులలో  ఆరూరి రమేష్ కూడా ఒకరు.  వీరిద్దరూ సుదీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఒకరంటే ఒకరు మంచి ఆప్తులుగా ఉండేవారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ఒకరికొకరు చర్చించుకునేవారు. ఇలాంటి దగ్గరి మిత్రులు ప్రస్తుతం శత్రువులుగా మారారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు శాశ్వత మిత్రులు ఉండరని నిరూపించారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు బరిలో నిలిచి హోరా హోరిగా తలపడుతున్నారు.  విజయం సాధించేది ఎవరో తెలియదు కానీ, ఒకే తాటిపై ఉన్న ఈ ఇద్దరు నేతలు కొట్టుకోవడం ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.

 ఆరూరి రమేష్ Vs కడియం శ్రీహరి( కావ్య):
 ఒకప్పుడు ఈ ఇద్దరు నేతలు గురు శిష్యులుగా ఉండేవారు. దాదాపుగా వీరి మధ్య బంధం 20 ఏళ్లుగా కొనసాగుతోంది.  కానీ ఈ ఎంపీ ఎన్నికల పుణ్యమా అని ఇద్దరు బద్ద శత్రువులు అయ్యారు. వీరిమధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి ఏర్పడింది. వరంగల్ పార్లమెంటు బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బరిలో నిలించింది. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు.

 రాజకీయ ప్రస్థానం:
 కడియం శ్రీహరి రాజకీయ ప్రస్థానం 1987 టిడిపి ద్వారా మొదలై ఆ తర్వాత ఎన్నో పదవులు అలంకరించి 1994లో స్టేషన్ ఘన్పూర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక దీని తర్వాత ఆ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించి చాలా సార్లు పోటీ చేశారు. ఇక ఆరూరి రమేష్ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ముందుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి పైనే పోటీ చేశారు. కానీ ఓటమిపాలై బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో కడియం కూడా బీఆర్ఎస్ లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఈ క్రమంలోనే  ఆరూరి రమేష్ కు వర్ధన్నపేట టికెట్ ఇప్పించారు. అలా వర్ధన్నపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా రమేష్ గెలుపొందారు. ఆయన గెలుపుకు కడియం శ్రీహరి కూడా ఎంతో సహకరించారని తెలుస్తోంది. అలా వీరిద్దరి మధ్య రాజకీయంగా 20 ఏళ్ల అనుబంధం ఉంది. 2023 ఎన్నికల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడియం  ఘనపూర్ నుంచి గెలుపొందగా,  ఆరూరి రమేష్ వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన ఓటమికి కారణం కడియం శ్రీహరి అనే  ఆరోపిస్తూ వస్తోంది. అయితే బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆరూరి మరోసారి మంత్రి అయితే  హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుందని తను ఓడించడం కోసం కడియం శ్రీహరి అనేక వ్యూహాలు పన్నారని ఒక టాక్ వినిపించింది. ఇలాంటి తరుణంలో ఆరూరికి మరియు కడియంకు మధ్య వైరం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇద్దరూ వరంగల్ బరిలో నిలిచేలా చేసింది.

 గెలుపు ఎవరిది:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరూరికి కడియం శ్రీహరికి మంచి గుర్తింపు ఉన్నది. అయితే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని తన కూతురు కావ్య కు వరంగల్ ఎంపీ టిక్కెట్టు ఖరారు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే రమేష్ బీఆర్ఎస్ ను విడిచి బిజెపిలో చేరి పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నారు. దీంతో అప్పటి చిరకాల మిత్రులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు.  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తున్నారు. కడియం శ్రీహరి కూడా నీకు రాజకీయ బిక్ష పెడితే నాకే వెన్నుపోటు పొడుస్తున్నావ్ అని ఆరోపిస్తూ ఉంటే,  ఆరూరి రమేష్ కడియం కావ్య లోకల్ కాదని ఆమె గుంటూరుకు చెందిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు.  ఈ విధంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరి ఇద్దరిలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: