•దశాబ్దాల పాటు పార్టీని వదలకుండా ప్రజల ఆదరణ పొందిన మనసున్న మహారాజు అశోక్ గజపతి రాజు

•ప్రజల కోసం ఎన్నో దాన ధర్మాలు చేసిన రాజ కుటుంబీకులు అశోక్ గజపతి రాజు 


విజయనగరం - ఇండియా హెరాల్డ్: పూసపాటి అశోక్ గజపతి రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ టాప్ నేతల్లో ముందు వరుసలో నిలిచే టాప్ నేత. చంద్రబాబు తరువాత టీడీపీలో అంతటి పవర్ ఫుల్ సీనియర్ నేత. చంద్రబాబుకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు అశోక్ గజపతి రాజు. పార్టీని వీడకుండా ఎన్నడూ ప్రక్కచూపులు చూడని గొప్ప నేత.. అంతటి గొప్ప పేరున్న నేత ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం బాధాకరం. రాజకీయాల్లో అసలు అశోక్ అంటే తెలియని వారుండరు. విజయనగర సంస్థానాధీశులైన గజపతి రాజుల వారసులే ఈ అశోక్ గజపతి రాజు. విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీకులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎవరికీ లేవు. ఒకనాడు వారు సంస్థానాల ద్వారా తమ ప్రజలను పాలించారు.గొప్ప రాజులుగా చరిత్రలో నిలిచారు. తరువాత ప్రజాస్వామ్య యుగంలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడి వారికి సేవ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తమ ఆస్తులను కూడా ప్రజలకు దానం చేశారు.విజయనగరంలో  అణువణువూ పూసపాటి వంశీకులదే. అదంతా కూడా ప్రజలకి దానం చేశారు. ఈ రోజులలో భూ కబ్జాలు చేస్తూ వందల ఎకరాలను తమ సొంతం చేస్తున్న తరం ఒక వైపు ఉంటే తమది అయిన విలువైన భూములను ఇచ్చేసిన ఉదారత్వం ఈ పూసపాటి రాజులది.అంతటి గొప్ప వంశానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు డౌన్ టు ఎర్త్ కి నిలువెత్తు ఉదాహరణ. తన గత చరిత్రను వంశాన్ని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. అలాగే ప్రజలు కూడా ఆయన్ని ఆదరించారు.రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు.


1978లో తొలిసారి జనతా పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన అశోక్ గజపతిరాజు మొత్తం పది సార్లు ఎన్నికల బరిలో దిగగా 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2019పార్లమెంట్ ఎన్నికలు తప్ప వరుసగా అన్నీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజకీయాల్లో చంద్రబాబుతో సమకాలిక రాజకీయాలు చేసిన నేతగా అశోక్ గజపతి రాజు గుర్తింపు పొందారు. 2014లో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలోనే అనారోగ్యంతో బాధపడిన అశోక్ గజపతిరాజు ఎన్నికల తరువాత మేజర్ సర్జరీ చేయించుకున్నారు.


70 సంవత్సరాల వయసులో అశోక్ గజపతిరాజు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన్ని అనారోగ్య సమస్యలతో పాటు మాన్సాస్ ట్రస్ట్ వివాదాలు వంటి సమస్యలు వెంటాడాయి.. రాబోయే ఎన్నికల్లో మరోసారి విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఎంపిగా బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు కానీ విజయనగరం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన కుమార్తె అదితి గజపతి రాజుకు టిక్కెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో అశోక్ గజపతిరాజు పోటీపై అభిమానుల్లో చాలా సందేహాలు వ్యక్తమవ్వగా ఆయన తన  అనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. దశాబ్దాల నుంచి టీడీపీ పార్టీకి అండగా నిలిచిన అశోక్ గజపతి రాజు భవిష్యత్తులో ఒక సీనియర్‎గా పార్టీ ఎప్పుడైనా, ఏమైనా సలహాలు అడిగితే  తప్పకుండా ఇస్తానన్నారు. ఏది ఏమైనా అనారోగ్య కారణాలతో టీడీపీకి ఇలాంటి గొప్ప నేత దూరం కావడం వల్ల టీడీపీ శ్రేణులు నిరాశలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: