- సమస్యల వలలో మత్స్యకారులు.
- ఏళ్ల నుంచి చేసిన మార్పు లేదు.
- ఫిషింగ్ హార్బర్లతోనే మార్పు వస్తుందా.?
ఆంధ్రప్రదేశ్ లో చాలామంది గంగపుత్రులు మత్స్య సంపద పైనే ఆధార పరిజీవనం సాగిస్తారు. సముద్ర తీరాల్లో ఉంటూ చేపలు పట్టుకొని వాటిని అమ్మేసి కుటుంబాలను సాకుకుంటున్నారు.  అలాంటి మత్స్యకారులకు ఇప్పటికీ సరైన జీవనాధారం లేక  కష్టాల కడలిని అనుభవిస్తున్నారు. సమస్యల వలలో చిక్కుకొని  కొట్టు మిట్టాడుతున్నారు. ఎంత పని చేసినా కనీసం ఒక్క పూట తిండి కూడా తినలేని పరిస్థితుల్లో గంగపుత్రులు ఉన్నారు.

 దేశంలో గుజరాత్ రాష్ట్రం తర్వాత సుదీర్ఘమైనటు వంటి సముద్ర తీరరేఖ కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్. మొత్తం 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. దాదాపు ఈ తీరంపై 20 లక్షల మంది మత్స్యకారులు  వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాంటి మత్స్యకారులు చాలా సమస్యల్లో చిక్కుకొని ఒడ్డునపడ్డ చేపల్లా కొట్టుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం, ఫిషింగ్ హార్బర్లు లేకపోవడం, కోల్డ్ స్టోరేజ్ గదులు ఉండకపోవడం, సరైన మార్కెటింగ్ చేయలేకపోవడం,  వీటికి తోడు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలు వారిని చుట్టుముట్టాయి. అంతేకాకుండా గతంలో రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళితే పుష్కలంగా చేపలు దొరికేవట. కానీ ప్రస్తుత కాలంలో  ఒడిస్సా పశ్చిమ పక్క ప్రాంతాలు వెళ్తే గాని చేపలు దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సముద్ర తీర ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రతీరాల్లో కలవడం వల్ల  చాలా వరకు చేపలు మరణించడం లేదంటే లోపలి వైపున వెళ్ళిపోవడం వల్ల చాలా దూరం వెళ్లి చేపలు పట్టవలసి వస్తుందట. అంతే కాకుండా బోట్లలో పోసే డీజిల్ రేట్లు కూడా పెరగడం వల్ల అది కూడా వ్యయ భారం పెరిగి పోయిందని అంటున్నారు. ఈ విధంగా రోజంతా సంపాదించిన దాంట్లో అన్నీ పోను 200 కంటే ఎక్కువ మిగలడం లేదని, ఇలాగైతే కుటుంబాలను పోషించేది ఎలాగా అంటూ  అంటున్నారు.

 మత్స్యకారులను కాపాడేదెలా?
 మత్స్యకారులు ఎంతో కష్టపడి కిలోమీటర్ల దూరం తీరాలకు వెళ్లి  చేపలను పట్టుకొస్తే  అమ్మకానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  వీదేశీయ మార్కెట్ లో కరోనా విపత్తు నుంచి ఇప్పటికీ సరిగ్గా కోలుకోలేదు.  దీంతో దేశీయా మార్కెట్లోనే చేపలను అమ్ముకోవాల్సి వస్తోంది. దళారులు చెప్పినదే ధర అనే విధంగా మారుతుంది. కష్టపడి పట్టుకొచ్చిన చేపలను  దళారుల చేతుల్లో పెట్టి మత్స్యకారులు నష్టపోతున్నారు. దళారీ వ్యవస్థను  ప్రభుత్వం కట్టుదిట్టం చేయాలి. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో  ఫిషింగ్ హార్బర్లు లేక మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పడవలు నిలిపిన స్థలాల్లో పూర్తిగా ఇసుక మేటలు ఏర్పడి  పడవను  ముందుకు కదిలించాలంటే గగనమే అవుతుందట. కాబట్టి ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తే  ఆ కష్టాలు తీరుతాయని మత్స్యకారులు అంటున్నారు. అలాగే పట్టుకొచ్చిన చేపలను ఏరోజు కారోజు   అమ్మితే ఏం కాదు కానీ, అవి అమ్మకం జరగకపోతే పాడైపోవాల్సిందే. ఆరోజు అమ్మకపోయినా రెండో రోజు అమ్ముకునేలా కోల్డ్ స్టోరేజీలు కూడా నిర్మించి ఇవ్వాలని  వారు కోరుతున్నారు. అలాగే విపత్తులు వచ్చిన సమయాల్లో  కొన్ని నెలలపాటు చేపల వేట నిలిచిపోతోంది. ఈ సమయంలో కూడా వారికి  ప్రభుత్వం సాయం అందించాలని తెలియజేస్తున్నారు. అలాగే పడవలు, బోట్ల కొనుగోలు విషయంలో పూర్తిస్థాయి సబ్సిడీలు ప్రభుత్వం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ విధంగా మత్స్యకారులకు ప్రభుత్వాలు సహకారం అందిస్తే మత్స్య కలలాంధ్రప్రదేశ్ కచ్చితంగా అవుతుందని  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: