దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అందులో రెండు కీలకమైన రాష్ట్రాలు దక్షిణ భారతంలో ఉన్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య వంటి అనుభవజ్ఞుల నాయకత్వం ఉండగా, తెలంగాణాలో మాత్రం మంత్రిగా కూడా పనిచేయకుండానే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన యువ నాయకుడు రేవంత్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆయన పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటి వరకూ పూర్తిగా నిలబెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గడచిన ఏడాది కాలంగా తమ సత్తాను నిరూపించుకుంటూ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో కొత్త ఊపుని తీసుకొచ్చారు.
 

2014 నుంచి బీఆర్ఎస్ దుర్గాన్ని బద్దలుకొట్టడమే కాదు .. అధికారాన్ని చేజిక్కించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే కీలకమైన బీసీ కుల గణనను చేపట్టడం ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ బీసీ గణన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జాతీయ అజెండాలో ప్రధానంగా ఉంది. ఓబీసీలను తమవైపు మళ్లించేందుకు కాంగ్రెస్ ఉద్దేశిస్తున్న ఈ సమాజ సాధన యాత్రలో మొదటి అడుగును తెలంగాణాలోనే వేయించడం హైకమాండ్‌ను ఖుషీ చేసింది. ఇప్పటికీ రాహుల్ గాంధీ అనేక వేదికలపై “తెలంగాణానే మొదటి రాష్ట్రం” అంటూ బీసీ గణన విషయాన్ని దేశానికి ఉదాహరణగా చెబుతున్నారు. ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేజర్ ప్లస్ అయింది.



రెవంత్ రెడ్డిని ఓ యువ సీఎం గా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రొజెక్ట్ చేయడంలో బీసీ గణన కీలక హస్తంగా నిలిచింది. పార్టీ కార్యకర్తలు, నేతలు, సామాజిక వర్గాలు అన్నీ కలిసి రేవంత్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఏడాది లోపే ఆయన సాధించిన ఈ అద్భుత విజయానికి రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ జాతీయ స్థాయికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణాలో మొదలైన ఈ సామాజిక జాగరణ.. దేశవ్యాప్తంగా ఓ కొత్త దిశకు నాంది పలకనుందంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తం మీద... బీసీ కుల గణన ద్వారా రేవంత్ రెడ్డి – తెలంగాణాలో కాదు దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: