
ఇంతవరకు రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో, నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు పదవిలోనే కొనసాగేవారు. దీంతో ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని, పరిపాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేంద్రం భావిస్తోంది. ఇదే కారణంగా ఈ బిల్లును తేవాల్సి వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షం తీవ్రంగా మండిపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. "ఇది రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికే కేంద్రం వేసిన పన్నాగం" అంటూ ఆరోపిస్తోంది. తప్పుడు ఆరోపణలు పెట్టి, కేవలం అరెస్టుల ఆధారంగా ఎన్నికైన ముఖ్యమంత్రులను గద్దె దింపడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పని వాదిస్తోంది. నిజంగా నేరం రుజువు కాకముందే పదవిని కోల్పోవడం న్యాయం కాదని కాంగ్రెస్ మండిపడుతోంది.
కేవలం ఈ ఒక్క బిల్లే కాదు.. కేంద్రం మరో మూడు బిల్లులను కూడా ప్రవేశపెట్టబోతోంది. వాటిలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు-2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2025, అలాగే ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లులు ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ బిల్లుతో రాష్ట్ర హోదా మళ్లీ వస్తుందా అన్న ఉత్కంఠ పెరిగింది. ఇకపోతే, ఈ బిల్లులన్నీ లోక్‌సభలో చర్చకు రావడంతో దేశ రాజకీయాల్లో మరొక తుఫాను రానుందని స్పష్టమైంది. చూడాలి మరి.. కేంద్రం నిశ్చయమే గెలుస్తుందా? లేక ప్రతిపక్ష అడ్డంకులే బలమవుతాయా?