ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ – ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ఒక్క‌సారిగా తన స్టైల్‌లో స్పందించి చర్చకు తెరలేపారు. టీడీపీ ఎమ్మెల్యేలే అడిగిన ప్రశ్నలకు ప‌వ‌న్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “చెప్ప‌డం తేలిక .. చేస్తే తెలుస్తుంది .. అధ్య‌క్షా!” అంటూ కౌంటర్ ఇచ్చారు. నాలుగు నిమిషాల సమాధానంలో ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకున్నా, ఆయనలోని అసహనం మాత్రం బయటపడింది. సభ్యులు అడిగిన ప్రశ్నలు సాధారణం కావు. “ప్లాస్టిక్ రహిత రాష్ట్రం ఎప్పటికి సాధ్యం? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎలా అమలు చేస్తున్నారు? ప్లాస్టిక్ పరిశ్రమలను మూసివేయడంలో ఏమి అడ్డంకులు?” అన్న ప్రశ్నలు వరుసగా వచ్చాయి. ఈ ప్రశ్నలకు పవన్ ఇచ్చిన సమాధానమే అసెంబ్లీ హైలైట్‌గా మారింది.


“సభ్యులందరికీ ఈ సమస్యల గురించి తెలుసు. తెలిసి కూడా అడిగితే ఎలా?” అంటూ మొదలుపెట్టిన పవన్, “అన్నీ రాత్రికి రాత్రే జరగవు” అంటూ గట్టిగానే చెప్పేశారు. ప్లాస్టిక్ భూతం ఒక రాష్ట్ర సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య అని గుర్తు చేశారు. ప్లాస్టిక్ పరిశ్రమలను ఒక్కసారిగా మూసేస్తే, వేలాది మంది ఉద్యోగులు రోడ్డుపై పడతారని పవన్ స్పష్టం చేశారు. “అప్పట్లో వాళ్ల భవిష్యత్తు చూసేది ఎవరు? ఉద్యోగాలు కల్పించేది ఎవరు? అదే మళ్లీ ప్రభుత్వ భాధ్యత కాదా?” అంటూ ఎమ్మెల్యేలకు ప్రశ్న వేశారు. ఒక ఫ్లెక్సీ లేదా బ్యానర్ వల్లే ఎన్నో సమస్యలు వస్తున్నాయని పవన్ చెప్పుకొచ్చారు. వాటిని నిషేధించాలన్న ఆలోచన ప్రభుత్వానికీ ఉందని తెలిపారు. కానీ వాటి వెనుక ఉన్న పరిశ్రమలు, పెట్టుబడులు చూసి ఒక్కసారిగా అడ్డుకోవడం సులభం కాదని వివరించారు.



“ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానుకోవాలి. అందుకే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది టైమ్ బౌండ్ ప్రక్రియ” అని పవన్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ఒక్క మంత్రికి సాధ్యమయ్యేదే కాదని, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. “రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అందరి సహకారంతోనే సాధ్యం” అని చెప్పారు. మొత్తం మీద పవన్ క‌ల్యాణ్ స్పందనలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం రెండూ కనిపించాయి. “సమస్యలు ఒక్క రోజులో రాలేదు, ఒక్క రోజులో పోవు కూడా” అని ఆయన ఇచ్చిన కౌంటర్ అసెంబ్లీ వాతావరణాన్ని హీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: