రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్న పురందేశ్వరి త్వరలోనే రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని సమాచారం. ఇక ఆమె స్థానంలో తన కుమారుడు దగ్గుబాటి హితేశ్ చెంచురామ్‌ను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని కుటుంబం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, హితేశ్ చెంచురామ్ ముగ్గురి మధ్య చర్చలు ముగిసినట్లు నమ్మదగిన వర్గాల సమాచారం. దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుతో ముడిపడి ఉన్న కుటుంబం.
 

ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమై పుస్తకరచనలో, కుటుంబ జీవితంలో మమేకమయ్యారు. ఇప్పుడు అదే మార్గంలో పురందేశ్వరి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించిన పురందేశ్వరి ఇక రాజకీయాల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక హితేశ్ చెంచురామ్‌ను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపేందుకు దగ్గుబాటి కుటుంబం సన్నాహాలు ప్రారంభించింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు కానీ రాజమండ్రి పార్లమెంట్ స్థానమే ప్రధానంగా పరిశీలనలో ఉందని సమాచారం. హితేశ్ చెంచురామ్ 2019లో వైసీపీకి చేరినా ఆ సమయంలో విదేశీ నివాసం కారణంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.

 

ఇక ఆ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి కుటుంబాల మధ్య సయోధ్య నెలకొనడంతో హితేశ్ చెంచురామ్ టీడీపీ తరఫున బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది. పార్టీ వర్గాల ప్రకారం, చంద్రబాబు ఇప్పటికే హితేశ్‌ పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యువ నాయకుడిగా హితేశ్ చెంచురామ్‌ను పార్టీ ప్రోత్సహించాలని టీడీపీ భావిస్తోంది. మొత్తానికి దగ్గుబాటి కుటుంబం మరోసారి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీస్తోంది. పురందేశ్వరి రిటైర్‌మెంట్‌తో పాటు హితేశ్‌ ఎంట్రీ తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చే అవకాశముంది. రాజమండ్రి నుంచి హితేశ్ పోటీ చేస్తే అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. దగ్గుబాటి కుటుంబం మళ్లీ శక్తిగా నిలవడానికి ఇది కీలక మలుపుగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: