ఎన్టీఆర్ ట్రస్టు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది - సేవ, సమర్పణ, స్ఫూర్తి. ఆ పునాదిని మరింత బలపరుస్తూ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలోని మహిళలు, అట్టడుగు వర్గాలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం ఉపాధితో తమ జీవితాలను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమె “స్త్రీ శక్తి మహిళా సంఘం” ద్వారా మరో విభిన్న ప్రణాళికను ప్రారంభించారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వేలాది మహిళలకు చేతివృత్తులు, కుట్టు, డిజైనింగ్‌, క్రాఫ్ట్ ట్రైనింగ్‌లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణ పొందిన మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకే భువనేశ్వరి ఈ కొత్త అడుగు వేసారు.


 “స్త్రీ శక్తి హ్యాండీక్రాఫ్ట్స్ స్టోర్స్” పేరుతో హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో మహిళల చేతులతో చేసిన ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సమీపంలో జరిగిన ప్రారంభోత్సవంలో నారా భువనేశ్వరి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - “మహిళలు సంపాదించే ప్రతి రూపాయి కుటుంబానికి, సమాజానికి బలం చేకూరుస్తుంది. స్త్రీ శక్తిని సమాజ శక్తిగా మలచడం మా లక్ష్యం” అన్నారు.ఈ స్టోర్లలో వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్‌, ఆభరణాలు వంటి ఎన్నో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.

 

స్వల్ప లాభాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో నుండి ఖర్చులు తీసి మిగిలిన మొత్తాన్ని స్త్రీ శక్తి సంఘ ఖాతాలోనే వేస్తారు. ఆ నిధిని సభ్యుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 600 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ ఎన్టీఆర్ ట్రస్టు ఇచ్చిన అవకాశాలతో తమ జీవితాలను స్వయం ఆధారంగా తీర్చిదిద్దుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను వేలల్లోకి పెంచే లక్ష్యంతో ట్రస్టు ముందుకు సాగుతోంది. సమాజంలో మహిళలు స్వయంగా ఆర్థికంగా ఎదగడం, వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం — ఇదే నిజమైన “స్త్రీ శక్తి”! నారా భువనేశ్వరి ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి నిరూపించారు, సేవకు పార్టీలు అవసరం ఉండవు… హృదయం ఉండాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: