కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విడుదలైన ‘2026 మెగా పోల్’ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మార్పు వైపు ఓటర్ల మూడ్ కదులుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఎల్‌డీఎఫ్‌కు ఈసారి గట్టి సవాల్ ఎదురవుతుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 వేల మంది అభిప్రాయాలు సేకరించారు. ఫలితాల ప్రకారం యూడీఎఫ్‌కు 43–45 శాతం ఓటు వాటాతో 81 నుంచి 86 సీట్లు దక్కే అవకాశముందని మెగా పోల్ పేర్కొంది. మరోవైపు ఎల్‌డీఎఫ్ 39–41 శాతం ఓట్లతో 51 నుంచి 59 స్థానాల పరిధిలోనే నిలిచే అవకాశముంది. ఎన్‌డీఏకు 13–15 శాతం ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు 0 నుంచి 2 మధ్యే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయి. ఇతరులకు 2–3 శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.
ముఖ్యంగా శబరిమల వివాదంతో పాటు అవినీతి ఆరోపణలు, గోల్డ్ స్మగ్లింగ్ వంటి అంశాలపై వచ్చిన ఆరోపణలు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని సర్వేలో తేలింది. తటస్థ ఓటర్లు మరియు సాఫ్ట్-లెఫ్ట్ వర్గాలు కూడా ఈసారి యూడీఎఫ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. క్రిస్టియన్ ఓటు బ్యాంకు యూడీఎఫ్‌గా అనుకూలంగా ఉండటంతో పాటు ఐయూఎంఎల్ మద్దతుతో ముస్లిం ఓటర్లు కూడా యూడీఎఫ్‌కు మొగ్గుచూపుతున్నారని సర్వేలో తేలింది.ఉత్తర కేరళంలో యూడీఎఫ్‌కు గణనీయమైన మద్ధతు లభించబోతుంది అనడానికి ఈ సర్వేనే నిదర్శనం.
వరి రైతులు, మత్స్యకారులు, జీడిపప్పు కార్మికులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఎల్‌డీఎఫ్‌కు ప్రతికూల సంకేతాలు ఇస్తోంది. దక్షిణ కేరళలో సంప్రదాయంగా ఎల్‌డీఎఫ్‌కు మద్దతుగా ఉన్న వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తున్నట్లు సర్వే పేర్కొంటోంది.
అయితే ఇది ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకతగా పరిగణించలేమని, ఏకపక్షంగా కాకుండా తీవ్రమైన పోటీ ఉండబోతోందని కూడా సర్వే అంచనా వేస్తోంది. ఎన్నికల తేదీ వరకు రాజకీయ ఎత్తుగడలు, కూటముల వ్యూహాలు, ప్రభుత్వ ప్రతిస్పందన వంటి అంశాలు తుది ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ధోరణి ఎన్నికల వరకు కొనసాగితే మాత్రం యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ మెగా సర్వే సూచిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి