హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీసీ డిక్లరేషన్ బెడిసి కొట్టేసూచనలు అగుపిస్తున్నాయి. పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బాబు తనంతట తానే ఏరికోరి ఇంకో సమస్యను తెచ్చుకుంటున్నారు. ఒక వర్గాన్ని ఆకట్టుకోవడానికి బాబు ప్రయత్నిస్తే మిగతా వర్గాలవారంతా అలకపాన్పు ఎక్కే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. బాబు బీసీ డిక్లరేషన్ పార్టీలో పెద్దదుమారాన్నే రేపుతోంది. బాబు బీసీ డిక్లరేషన్ పార్టీలో చర్చనీయంశంగా మారింది. ‘తొందర పడి ఒక కోయిల ముందే కూసింది’ అన్న చందంగా తయారైందనీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాబు తీసుకున్న నిర్ణయం పార్టీకి లాభంకంటే నష్టమే ఎక్కువ కల్గించడం ఖాయమనీ పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు తెలుగుతమ్ముళ్లు తమ మనసులోని మాటల్ని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం వుంది. ఇప్పుడే బాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం పట్ల దగ్గరగా ఉన్న మిగతా వర్గాలను కూడా దూరం చేసుకోకపోవడం కాక మరేమిటవుతుందనీ వారు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు పార్టీకి బీసీలు అండదండగా ఉండేవారు. కొన్నిఏళ్లుగా అన్ని వర్గాల వారితో పాటు బీసీలూ పార్టీకి దూరమవుతున్నారు.
దూరమవుతున్న ఈ వర్గాలను తనవైపు తెచ్చుకోవడానికి గానూ బాబు రానున్న ఎన్నికల్లో 100సీట్లు ఇస్తామనీ ప్రకటించారు. ఇదే పార్టీలో దుమారానికి కారణమైంది. రాజకీయ చక్రం తిప్పడంలో చంద్రబాబుకు మంచిపేరు వుంది. కానీ, ఇటీవలి కాలంలో ఏమైందో ఏమో కానీ ఆయన వ్యూహాలు, ఎత్తుగడులు పనిచేయడం లేదు. వరుస పరాజయాలను చవిచూస్తున్నారు. పార్టీ పటిష్టత కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపయోగపడటం అటుంచి వికటిస్తున్నాయి. అనేకమంది పార్టీని వీడుతున్నారు. తెరవెనక మంత్రాంగం నడపడటంలో ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు ఈ మధ్య ఏమైందో ఏమో తెలియదు.
అన్నీ రివర్స్గ్ అవుతున్నాయి. ఉప ఎన్నికల్లో ప్రజలు పార్టీని కనుమరుగు చేశారు. అయినప్పటికీ బాబు మళ్లీ అసంత్రుప్తులు మరింత అసంత్రుప్తులయ్యే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనీ తమ్ముళ్లే అంగీకరిస్తున్నారు. బీసీలకు 100సీట్లను ప్రకటించి బీసీ నాయకులతో ప్రశంసించే విధంగా తనకు తానే ఓ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారనే ఆరోపణలు వెల్లివెత్తాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోలేదనీ, బాబు హయాంలోనే కులవ్రుత్తులన్నీ మూలనపడ్డాయనీ, అలాంటి హైటెక్కు బాబు ఇప్పుడు బీసీలు యాదికి రావడం ఆశ్చర్యకరంగా వుందంటున్న వారు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అంతా తన కనుసన్నల్లో నడుస్తుందనీ అందరూ అనుకుంటుంటారు.
కానీ, లోలోపల మాత్రం బాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారు చాలా మంది తయారైనట్లు తెలుస్తోంది. బీసీ డిక్లరేషన్ విషయమై కూడా పలువురు తమ అసంత్రుప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీని వల్ల గెలిచే చోట ఓడిపోవడం కూడా ఖాయమనీ పలువురు తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. బాబు నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నట్లు వారంటున్నారు. బాబును తప్పుదోవ పట్టించే విధంగా కొందరు పార్టీలో ఉన్నారనీ, వారివల్లనే పార్టీ ప్రజలకు దూరమవుతుందనీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఏళ్లతరబడిగా పనిచేసిన వారికి నష్టం కల్గితే ఇక పార్టీలో ఎందుకుంటారనీ ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. గెలిచే చోట టికెట్ ఇవ్వడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు.
కానీ, గుండుగుత్తగా100సీట్లను ఇవ్వడం వల్ల నష్టం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ అంటున్నారు . ప్రకటించాక వారికి ఇవ్వకుంటే బీసీలు దూరం కావడం ఖాయం. మొత్తమ్మీద బాబు బీసీ డిక్లరేషన్ కలకలంరేపుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: