హైదరాబాద్: ‘పుండు ఒక దగ్గర ఉంటే మందు మరో దగ్గర రాసిన’చందంగా వుంది రాష్ర్టంలోని కాంగ్రెస్ వైఖరి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముద్రను పూర్తిస్థాయిలో చెరపేందుకు రాష్ట్రంలోని కిరణ్ సర్కార్ సిద్దమవుతోంది. ఇక మీదట ఇందిరమ్మ బొమ్మతోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయానికి వచ్చింది. ఆ దిశగా ముందుకు వెళ్లడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు మంత్రి ధర్మాన ప్రసాదరావు నేత్రుత్వంలో ఏర్పాటైన కమిటీ పార్టీకి, ప్రభుత్వానికి పలు కీలకమైన సూచనలు చేసింది. పార్టీ బతుకాలంటే పద్నాలుగు సూత్రాలను పాటించాలనీ నివేదికను అందచేసింది.
వీటిలో ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి పేరు ఇక మీద ఉచ్చరిచ్చకుండా, బొమ్మ లేకుండా అన్ని పథకాలకు ఇందిరమ్మ బొమ్మతో ప్రజల్లోకి వెళ్లాలనీ, గ్రామస్థాయి నుంచీ పార్టీని ప్రక్షాళన, వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల నిర్వహాణ, పేద వర్గాల అమ్మాయిల పెళ్లికి ప్రభుత్వమే తాళిబొట్లు అందజేయాలి, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఓ టెలివిజన్, ఓ పత్రికను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మరింత పటిష్టం కావాలంటే, భవిష్యత్ లో పార్టీ బతకాలంటే వీటన్నింటిని తూ. చ. తప్పకుండా అమలు చేయాలనీ ధర్మాన కమిటీ నివేదికను అందజేసింది.
అన్నింటికంటే ముఖ్యమైనది రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా చేసి అన్ని పథకాలకు ఇందిరమ్మ బొమ్మతోనే ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా సూచించింది. ఇప్పటి వరకు రాష్ర్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పథకాలుగా ముద్రపడ్డాయి. ఇక మీదట ఈ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రారంభించిన పథకాలుగా ప్రజలకు వివరించాలనీ, ఇందిరమ్మ బొమ్మ పథకాలతో వెళ్లడంతోనే పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కిరణ్ సర్కార్ పావులు కదుపుతోంది. కసరత్తులు చేస్తోంది. దీనితోనే తెరపైకి ఇందిరమ్మ బొమ్మను తెచ్చేందుకు కిరణ్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా వుంది. అటు సీమాంధ్రలో చూసినా, ఇటు తెలంగాణలో చూసినా పార్టీ పరిస్థితి ఎంత మాత్రం బాగుగా లేదు. దీనికి నిదర్శనమే జూన్ నెలలో జరిగిన 18అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితాలు. సీమాంధ్రలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ హవా కొనసాగుతుండగా...తెలంగాణలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కాబోర్లా పడ్డది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ ‘ఇందిరమ్మ’, ‘రాజీవ్’ పేర్లనే పెట్టారు. కానీ, ఈ పథకాలన్నీ రాజశేఖర్ రెడ్డికి పేరు తెచ్చాయి. వైఎస్ కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ జగన్ కు పేరు తెస్తుండటంతో రాష్ర్ట కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్వేననీ, వ్యక్తిగతం కావని చెప్పేందుకు కాంగ్రెస్ అప్పటి పథకాలన్నింటికి ఇక మీదట ఇందిరమ్మ బొమ్మలతోనే ప్రచారం చేయాలనుకుంటోంది. వైఎస్ పేరును తొలగించడానికి కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థలో వుంది. ఈ టైంలో ఇందిరమ్మ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల లాభం జరుగుతుందనీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కానీ, ప్రజలు మాత్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పథకాలను ప్రారంభించవచ్చు, దేశంలో పలు రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వుంది కదా? అక్కడ ఎందుకు వీటిని అమలు చేయలేదనే భావనలో ప్రజలున్నారు. ప్రశ్నిస్తున్నారు. పార్టీలో కూడా పలువురు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. వైఎస్ఆర్ ను నిలువరించడానికి కొత్తగా కిరణ్ సర్కార్ ఇందిరమ్మ బొమ్మను తెరపైకి తేవడంతో సరికొత్త చర్చకు లేవనెత్తింది. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ బొమ్మ ఏమైనా వర్కటవుతుందా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: