హైదరాబాద్: ముందు నుంచీ చెబుతూ వస్తున్నట్లుగానే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఏయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా మరో మంత్రి గంటా శ్రీనివాస్ రావును వెంటబెట్టుకుని రాత్రి పది గంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ తో దాదాపుగా గంటకు పైగా సమావేశమయ్యారు. వాన్ పిక్ భూపందేరంలో సీబీఐ తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన విషయాలపై వీరివురు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మంత్రి ధర్మాన మాత్రం రాజీనామాకు సిద్ధపడి తన వెంట తెచ్చుకున్న రాజీనామా పత్రాన్ని సీఎం కిరణ్కు అందజేశారు.
మంత్రిగా తాను ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదనీ, ఎవరకీ లబ్ది చేకూరే విధంగా తాను తప్పుడు పనులు అసలే చేయలేదనీ ధర్మాన అన్నారు. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం వుందనీ, తనపై మోపిన అభియోగాలన్నీ వీగిపోతాయనే విశ్వాసం తనకు వుండబట్టే మంత్రి పదవీకి రాజీనామా చేశాననీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా తాను కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఏకైక లక్ష్యంతో పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన చెప్పారు. అయితే, తన రాజీనామా అమోదానికి మరికొంత సమయం పట్టవచ్చనీ తనతో సీఎం చెప్పినట్లు ధర్మాన అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి