హైదరాబాద్: రాష్ర్టంలోని కాంగ్రెస్ పార్టీకి, సర్కార్కు షాక్ ల మీద షాక్ లు వస్తున్నాయి. కిరణ్ సర్కార్ను ఊపిరాడకుండా చేస్తున్నాయి. సీఎం తరువాత 2వ స్థానంలో ఉన్న రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాన్ పిక్ భూపందేరంలో ఇరుక్కోవడంతో ఆయన నిన్న రాత్రి మంత్రి పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన ధర్మాన ప్రసాదరావు రాష్ర్టంలో ముఖ్యనాయకుడు. అనేక మంత్రి సంఘాల కమిటీలకు ధర్మాన నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మంత్రి పదవీకి రాజీనామా చేయడంతో ఆయన నాయకత్వం వహిస్తున్న ఉప సంఘాల కమిటీలను రద్దు చేస్తారా? లేక ఆయన స్థానంలో మరొకర్ని నియమించి యధాతథంగా నడిపిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అనేక ఉప సంఘాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ తాజాగా పార్టీ బలోపేతం,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వేసిన కమిటీ ఇటీవలనే సీఎంకు, పీసీసీ చీఫ్కు అనేక సూచనలు, సలహాలతో కూడిన నివేదికను ఇటవలనే అందజేసింది. ఈ కమిటీ వేసినప్పటి నుంచి సీనియర్లు రగలిపోతున్నారు. సీనియర్లను కాదనీ, సీఎం ఈ కమిటీ వేశారంటూ ఎండగడుతూ వచ్చింది. ఇప్పుడు అదే కమిటీ నాయకుడు ధర్మాన కేసుల్లో ఇరుక్కోవడం, మంత్రి పదవీకి రాజీనామా చేయడంతో ధర్మాన నాయకత్వంలో ప్రభుత్వానికి, పార్టీకి సూచించిన సలహాలు, సూచనల్ని పాటిస్తారా? లేక గాలికి వదిలేస్తారా? అనేది తేలాల్సి వుంది. అయితే ముందటి నుంచీ ఈ కమిటీని వ్యతిరేకిస్తున్న పలువురు సీనీయర్లు మాత్రం ధర్మాన నేత్రుత్వంలో సూచించిన సూచనలు, సలహాలు పాటించాల్సిన అవసరం లేదంటున్నట్లు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావే కేసుల్లో ఇరుక్కోని మంత్రి పదవీని వదులుకున్నప్పుడు ఆయన సూచనలకు అంతగా పట్టించుకోవల్సిన అవసరం లేదనీ పలువురు నేతలు పీసీసీపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ధర్మాన పేరును సీబీఐ చార్జిషీట్ లో పేర్కొనడాన్ని సాకుగా చూపించి కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసేందుకే పీసీసీ మొగ్గు కనబరుస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ధర్మాన కమిటీని రద్దు చేస్తారా? లేక ఆయన ఆధ్వర్యంలో ఉప సంఘం ఇచ్చిన సూచనల్ని,సలహాల్ని పాటిస్తారా? లేక వీటిని కూడా చించి చెత్తకుండిలో వేస్తారో చూడాలి మరి. మొత్తానికి ధర్మాన నాయకత్వంలో ఉన్న అనేక ఉప సంఘాల పరిస్థితి నేడు దిక్కు,మొక్కులేనివిగా మారబోనున్నట్లు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విధి విచిత్రమైందంటారు.  విధివిలాసం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. సరిగ్గా ఇప్పుడు ధర్మాన విషయంలో అదే నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: