జోరుగా హుషారుగా షికారు చేద్దమా... అన్నట్లుంది ఇప్పుడు చంద్రబాబునాయుని పరిస్థితి.తెగేదాకా లాగితే...అన్నచందంగా ఎక్కడ అవుతుందోనన్న భయం కూడా పార్టీశ్రేణులను వెంటాడుతోంది. అదే జరిగితే బాబు ప్లాన్ బద్దలయినట్లే. ప్రధానపోటిదారు అధికారపార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది.తాను ఏంచేసినా కూడా కనీసం విమర్శించే పరిస్థితుల్లో కూడా ఆపార్టీ లేదు. ఇక టీఆర్ఎస్ అయితే ఒకే ప్రాంతానికి పరిమితం,ఒకటే నినాదం,వైకాపా ఉన్నా కూడా అది ఇంకా పూర్తిగా రాజకీయరంగు పులుముకోలేదు,కష్టాల్లో ఉన్న అధ్యక్షడు జగన్ ను కాపాడుకోవడంలోనే బిజీ. బిజేపి,వామపక్షాలున్నా అవి అధికారం కోసం పోటిపడేవి కావు ఇలా చంద్రబాబుకు అన్నిగ్రహాలు కలిసి వచ్చాయి.ఇదంతా ఒక ఎత్తయితే ఈమద్య ఆయన వేస్తున్న ప్లాన్ లన్నీ తెగ కలిసివస్తున్నాయి.జనాల్లో మంచి స్పందననిస్తున్నాయి. కూర రుచిగా ఉందని రోజు అదే తిన్నా, ఎవరికైనా తినిపించినా ..కొన్నాళ్లకు మొహం కొట్టి అదంటేనే కక్కు వచ్చే పరిస్థితి వస్తుందంటారు. ఇది కొంపదీసి చంద్రబాబు ప్లాన్ల విషయం లోను జరిగితే పడ్డకష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఎందుకంటే బిసిల డిక్లరేషన్ ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకున్నారు. ఆతర్వాత ఎస్సీల వర్గీకరణపై డిక్లరేషన్ ఇచ్చి ఆవర్గాలను ఆకట్టుకున్నారు.వెనువెంటనే తెలంగాణపై డిక్లరేషన్ ఇచ్చి ఈప్రాంతంలో చావుబతుకుల్లో ఉన్న పార్టీకి కొంత ఆక్సీజన్ అందించారు.ఇదే జోరులో ఇప్పుడు మైనార్టీ డిక్లరేషన్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదికూడా వర్కవుట్ అవుతుంది అనుకుందాం. ఇవికాక రాష్ట్రంలో మరెన్నో కులాలు,వర్గాలు ఉన్నాయి, మరి వాటి సంగతేంటి, తన డిక్లరేషన్ ల జాబితాలో ఒకటి తర్వాత ఒకటి అన్నింటిని చేరుస్తారా...అలా చేస్తే బెడసికొట్టదా ఇదంతా కేవలం ఓట్లకోసమేనని ఇది సాధ్యం ఎలా అవుతుందని జనాలు భావించే అవకాశం ఉందిగా. అలా అని చేయకుంటే డిక్లరేషన్ లో లేని వర్గాలు,కులాలు ఆయనకు వ్యతిరేకంగా మారితే కూడా ప్రమాదమేగా అన్నభావన ఇప్పుడిప్పుడే తెలుగుదేశం వర్గాల్లో మొదలైందట. నిజమే మరి ఇదికూడా ఆలోచించాల్సిన అంశమే సుమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: