హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వ్యవహారం కాస్త గవర్నర్ దగ్గరకు చేరింది. వాన్ పిక్ ప్రాజెక్టులో సీబీఐ ధర్మానతో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ లపై చార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు ఆ ముగ్గుర్ని ప్రాసిక్యూషన్ చేయాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. దీనితో ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కిరణ్కు అందజేశారు. రాజీనామాను సీఎంకు తనకున్న అధికారంతో తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టారు. ప్రాసిక్యూషన్కు సంబంధించిన అధికారం సీఎం చేతుల్లో ఉండదు. ప్రాసిక్యూషన్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ధర్మాన చేసిన రాజీనామా లేఖను సీఎం ప్రస్తుతానికి తన వద్దనే వుంచుకున్నారు. దానిని గవర్నరుకు పంపితే రాజీనామా అమోదిస్తారా? ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తారా? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ధర్మాన రాజీనామా, ప్రాసిక్యూషన్కు సంబంధించి సీఎం కిరణ్ న్యాయనిపులు, ఢిల్లీ పెద్దలతో పాటు, గవర్నరుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.  ధర్మానను ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తే తప్పు చేసినట్లే. దీనితో గవర్నర్ ఇప్పుడు ఏం చేయబోతారో అనేది ఉత్కంఠగా మారింది. ధర్మాన, ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తప్పని సరి పరిస్థితుల్లో ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తే ఒక ధర్మానకే కాదు యావత్ మంత్రి వర్గానికి చుట్టుకుంటోంది. అప్పుడు రాష్ర్ట ప్రభుత్వ పరువు సముద్రంలో కలువడం ఖాయం. దీనితో ధర్మాన విషయం ఏం చేద్దామనేది సీఎం కిరణ్కు పెద్ద తలనొప్పిగా మారింది. సీబీఐ వ్యవహారిస్తున్న తీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక కుదుపు కుదేపిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా మంత్రులు కూడా తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఎప్పుడేమీ జరుగుతుందో తెలియక అందరూ వణికిపోతున్నారు.  ధర్మానను అరెస్టు చేయాల్సి వస్తే మిగతా మంత్రుల అరెస్టు తప్పదు. అప్పుడు కిరణ్ క్యాబినెట్ అంతా జైల్లోనే? ఇదే ఇప్పుడు అందర్ని కలవరపరుస్తోంది. ఈ విషయమై పీసీసీ బొత్స అధిష్టానం వద్ద తేల్చుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టానికి కొత్త ప్రాజెక్టులు రావాలంటే ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇవ్వడం ఆనవాయితీ అని, దాని ప్రకారమే తాము నడుచుకున్నామే తప్ప ఎవరూ హద్దులు దాటి ప్రవర్తించలేదనీ మంత్రులంటున్నారు. దీనిని సీబీఐ భూతద్దంలో పెట్టి చూపిస్తుందనేది మెజార్టీ మంత్రుల వాదనగా తెలుస్తోంది. గురువారం ధర్మానను కలిసిన అనేక మంది మంత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ర్ట ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందనీ మంత్రులన్నట్లు సమాచారం.  ఈ విషయమై పార్టీ అధిష్టానం వద్ద తేల్చుకోవడానికి పీసీసీ చీఫ్ బొత్సత రేపో, మాపో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఒక ధర్మానతో ముగిసేది కాదనీ, ఇదే కొనసాగితే అందరు మంత్రులు బలవుతుండటంతో దీనిపై అధిష్టానంతో చర్చించడానికి మంత్రుల తరుపున బొత్స ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. మొత్తానికి ధర్మాన వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది.  ఎక్కడ, ఎప్పుడు, ఎలా ముగింపు కార్డు పడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: