పల్లెల్లో కల్తీకల్లు,నాటుసారా ఏరులై పారుతోంది. కల్తీకల్లు, సారా మత్తులో పల్లెలు జోగుతున్నాయి. కాదు, కాదు ఊగుతున్నాయి. ఆస్పత్రుల్లో వంకర తింకరగా తిరుగుతున్నారు. ఈ కల్తీకల్లుకు బానిసలైన వారు వివిధ రోగాల బారిన పడుతున్నారు. కల్లును తాగుతున్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎందరికో కడుపుకోతను మిగిలిస్తోంది. కల్లును తయారీ చేస్తున్న వారు మాత్రం ‘మూడు సీసలు ముప్పది రూపాయలు’గా వారి వ్యాపారం దిన దినం అభివ్రుద్ధి చెందుతోంది. లిక్కర్, ఇసుక మాఫియా జాబితాలో కల్లు మాఫీయా చేరింది. దీంట్లోనూ అన్ని పార్టీల వాళ్లున్నారు. ప్రాణాంతకమైన క్లోరోఫాం, డైజోఫాం వంటి పదార్థాలను కలిపి తాగేటోళ్లకు కిక్ ఎక్కించి, చివరకు ఆ కిక్ లోనే చనిపోతున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన ఎక్సయిజ్ అధికారులు మామూళ్ల మత్తులో కూరుకుపోయారు. నిబంధనలు విరుద్దంగా కల్లును తయారు చేయడం వల్ల తాగుతున్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ఎక్సయిజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కల్తీకల్లు సంఘటనపై సాక్షాతు రాష్ర్టాధినేత కిరణ్ కుమార్ స్పందించినా ఎక్సయిజ్ అధికారులు మాత్రం తమ మొద్దు నిద్రను వీడటం లేదు. ఫలితంగా ఈ నెలలో కల్తీకల్లు తాగి 10మంది వరకు చనిపోయారు. వందలాది మంది ఆస్పత్రుల్లో మంచాన పడ్డారు. కల్తీకల్లు తాగి ఎవరైనా చనిపోయినప్పుడే ఎక్సయిజ్ అధికారులు హడావుడి ఉంటోంది. తరువాత షరా‘మామూల్లే’. కల్తీకల్లు తాగిన వారు ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా కల్లును తయారు చేస్తున్న వారు మేడల మీద మేడలు కట్టుకుంటున్నారు. వీరికి వత్తాసు పలుకుతున్న అధికారగణానికి, రాజకీయ నాయకులకు, మీడియా(ఏపీ హెరాల్డ్ కాదు)కు కాసులే కాసులు.   నెల నెలా సర్కార్ జీతం అందుతుందో లేదో కానీ, కల్లు వ్యాపారులు మాత్రం ఠంచన్ గా మామూళ్లను మాత్రం ఒక రోజుకూడా ఆలస్యం చేయరట. నెల నెలా లక్షల్లోనే చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు, రాజకీయ నాయకులకు, మీడియాకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో దీనిని ఆపాలనే ప్రయత్నం ఎవరూ చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. రోజు వారీ కూలీ నాళీ చేసుకునే వారు పొద్దుగూకినాక చేసిన కష్టం మరిచిపోయేందుకు తీసుకుంటున్న కల్లు వారి ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. ఈత, తాటి చెట్లు ఉంటేనే కల్లు అమ్మాలనే నిబంధనలున్నాయి. కానీ, ఇలా గ్రామాల్లో ఎక్కడా జరగడం లేదు. ముఖ్యంగా తెలంగాణ పల్లెలు కల్తీకల్లుతో జోగుతున్నాయి. ఈ కృత్రిమ కల్లుకు ఎందరో బానిసలుగా మారుతున్నారు. ఈ కల్లు తన ప్రాణాల్ని బలితీసుకుంటుందనీ తెలిసీ కూడా కల్లును తాగకుండా ఉండలేకపోతున్నారు. కల్తీకల్లుకు మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలంలోని చెప్యాల గ్రామస్తులు అస్వస్తతకు గురికావడమే కాకుండా, చికిత్స పొందుతూ ఓ మహిళ చనిపోయింది. మిరుదొడ్డి మండల ఘటనపై సాక్షాత్తు సీఎం కిరణ్ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ ఆదేశించి పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే ఇదే జిల్లాలోని తూప్రాన్ మండలంలోని కాళ్ల(కల్తీ)‘కళ్లు’కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కల్తీకల్లుకు ఊరు ఊరంతా తీవ్ర అస్వస్థతకు గురైంది. వంద మందికిపైగా మేడ్చల్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కూడా సీఎం కిరణ్ తీవ్రంగానే స్పందించారు.  కాళ్లకల్లు ఘటన మరిచిపోకముందే నిజామాబాద్ జిల్లాలో నిన్న కల్తీకల్లు తాగి 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరూ ఒకే రకంగా కాళ్లు, చేతులు వంకర తిరుగుతూ కొట్టుకుంటున్నారు. అయితే, కల్తీకల్లును నివారించాల్సిన ఎక్సయిజ్ అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీకల్లుతో పాటు గ్రామాల్లో నాటుసారా కూడా ఏరులై పారుతున్న ఎక్సయిజ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా అధికారయంత్రాంగం, పాలకపక్షం కలుగచేసుకుని కల్తీకల్లు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన తీసుకోవల్సిన అవసరం ఎంతయినా వుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: