జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చంచల్ గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. సీబీఐ విచారణ విషయంలో తనపట్ల ఒకరకంగా, మంత్రి ధర్మాన పట్ల మరో రకంగా వ్యవహరించడాన్ని మోపిదేవి జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ధర్మాన కేసు వేరు మోపిదేవి కేసు వేరంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై మోపిదేవి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అనుచరుల ఒత్తిడి మేరకు చంచల్ గూడ జైల్లోనే ఉన్న జగన్ తో మోపిదేవి పార్టీలో చేరిక విషయాన్ని చర్చించినట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే వైఎస్ఆర్ సీపీ నేత, గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మోపీదేవిని కలిసి మరింత సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. తామిద్దరి మంచి మిత్రులమని, అందుకే మోపిదేవిని కలిశానని రామకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో రాజకీయం లేదన్నప్పటికీ... మోపిదేవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సీటు రిజర్వు చేసినట్టు చెప్పేందుకే కలిశారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో మోపిదేవిని రేపల్లె నుంచే పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి