చాలామంది చాలా సందర్భాల్లో ఇతరులకు తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వారు చెప్పే మాటల్లో నిజం లేకపోయినా అవతలి వ్యక్తులు తమ గురించి గొప్పగా భావించాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ కాలం గడిపేస్తూ సమయం వృథా చేస్తూ ఉంటారు. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండదు. మాటలు కోటలు దాటతాయి కానీ పనుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. 
 
సమాజంలో ఇలాంటి వారిని చాలామందిని మనం ప్రతిరోజూ చూస్తూ ఉంటాం. ఇలాంటి వ్యక్తుల మాటల మాయలో పడితే మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు చాలా మంది ఏదైనా బిజినెస్ చేస్తే లక్షల రూపాయల లాభం వస్తుందని... తమ బంధువులు, స్నేహితులు బిజినెస్ చేసి లక్షలు సంపాదించారని చెబుతూ కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటారు. తీరా పెట్టుబడి పెట్టాక చాలా సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. 
 
మరికొందరు మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉంటారు. కమ్మనైన మాటలు చెప్పి మోసపోయామని గ్రహించేలోపే వీరు మోసాలకు పాల్పడుతూ ఉంటారు. మరికొందరు మాయమాటలు, అబద్ధాలు చెప్పి అప్పులు ఒకటి రెండు రోజుల్లో తిరిగి చెల్లిస్తామని తీసుకుంటూ ఉంటారు. అనంతరం ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తూ ఉంటారు. 
 
ఇలాంటి వారి మాటలను ఒకటి రెండుసార్లు విశ్వసించినా ఆ తరువాత ఎవరూ విశ్వసించరు. మాటలకూ చేతలకూ తేడా ఉంటే ఇతరులకు  చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అందువల్ల మనం ఎప్పుడైనా మాటలు, చేతలు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకపోతే మంచి అభిప్రాయం కాస్తా చెడుగా మారే అవకాశం ఉంది. అందువల్లే చేసే మాటలను చెబుతూ... చెప్పే మాటలను చేస్తూ ఉంటే ఇతరులకు సదభిప్రాయం, గౌరవం, విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: