ఈ ప్రపంచంలో చాలామంది సందర్భాన్ని బట్టి అబద్ధాలు చెబుతూ ఉంటారు. కొందరు అవసరం కోసం అబద్ధాలు చెబితే మరికొందరు అవతలి వ్యక్తులను మోసం చేయాలనే ఉద్దేశంతో అబద్ధాలు చెబుతూ ఉంటారు. అవతలి వ్యక్తికి మనం చెప్పింది అబద్ధమని తెలియకపోతే ఎటువంటి సమస్య లేదు కానీ ఆ వ్యక్తికి నిజం తెలిస్తే మాత్రం ఆ వ్యక్తి ముందు మనం తల దించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. 


 
జీవితంలో అవతలి వ్యక్తులతో మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలా చేస్తే వాళ్లు మనపై నమ్మకం, విశ్వాసం ఎప్పటికీ కోల్పోరు. మన నిజాయితీ ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కూడా ఎంతో దోహదపడుతుంది. అబద్ధం వల్ల తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడినా భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. కొన్ని సందర్భాల్లో ఒక అబద్ధం వంద అబద్ధాలకు దారి తీసే అవకాశం ఉంది. 


అలా కాకుండా అవతలి వ్యక్తులకు నిజమే చెబితే... నిజం చెప్పి వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తే సానుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలా మంది ఉద్యోగం విషయంలోనో, మార్కుల విషయంలోనో అవతలి వ్యక్తులు గొప్పగా ఊహించుకోవాలని అబద్ధాలు చెబుతూ ఉంటారు. చెప్పింది అబద్ధం అని తేలిన రోజున అవతలి వ్యక్తుల చేతుల్లో అవమానానికి గురి కావాల్సి ఉంటుంది. 


 
చాలామంది కుటుంబ సభ్యులతో, భాగస్వామితో తమను అర్థం చేసుకుంటారో లేదో అని అబద్ధాలు చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అబద్ధం వల్ల బంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ ప్రపంచాన్నే మార్చేంత శక్తి ఉంది. అబద్ధంతో నిజాన్ని దాచినా ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అందువల్ల జీవితంలో వీలైనంత వరకు నిజాయితీతోనే ఉండాలి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: